: డిగ్రీ పట్టా అందుకున్న షారూక్ ఖాన్!
ప్రముఖ బాలీవుడ్ నటుడు షారూక్ ఖాన్ తన డిగ్రీ పట్టాను అందుకున్నాడు. షారూక్ ఏంటీ, ఇప్పుడు డిగ్రీ పట్టా అందుకోవడమేంటన్న డౌట్ ఎవరికైనా రాక మానదు. అసలు సంగతేమిటంటే.. యశ్ రాజ్ ఫిల్మ్స్ ‘ఫ్యాన్’ చిత్రంలోని ఒక పాటను ప్రారంభించేందుకని షారూక్ ఈరోజు ఢిల్లీ వెళ్లారు. షారూక్ డిగ్రీ చదువుకున్న హంసరాజ్ కాలేజీలోనే ఈ కార్యక్రమం జరిగింది. 1985-88 బ్యాచ్ విద్యార్థి అయిన షారూక్ బీఏ (ఎకనామిక్స్) డిగ్రీ పూర్తయిన తర్వాత కాలేజీ గడప తొక్కలేదు. ఇప్పుడు సందర్భం కలిసిరావడంతో 28 ఏళ్ల తర్వాత తన డిగ్రీ పట్టాను కళాశాల ప్రిన్సిపాల్ చేతుల మీదుగా అందుకున్నాడు. ఈ సందర్భంగా షారూక్ ఖాన్ మాట్లాడుతూ, ‘1988లో కాలేజ్ నుంచి వెళ్లిపోయాను. నేను డిగ్రీ పట్టా అందుకుంటున్న సందర్భంలో మా పిల్లలు ఉంటే బాగుండేది. వాళ్లు ఉన్నట్లయితే ఈ కళాశాల మొత్తం తిప్పే వాడిని. అదే.. మిస్సయ్యాను’ అని చెప్పాడు.