: మాలో చివరి ఆటగాడి వరకు హిట్టర్లే...వరల్డ్ కప్ సాధనకు అది సరిపోదా?: ఇంగ్లండ్ క్రికెటర్ హేల్స్
త్వరలో భారత్ లో ప్రారంభం కానున్న టీట్వంటీ సిరీస్ లో తమ జట్టు కూడా టైటిల్ ఫేవరెట్లలో ఒకటని ఇంగ్లండ్ ఆటగాడు అలెక్స్ హేల్స్ అన్నాడు. లండన్ లో టీట్వంటీ వరల్డ్ కప్ ప్రదర్శన గురించి ప్రశ్నించగా సమాధానమిస్తూ, తమ జట్టులో 11వ నెంబర్ వరకూ హిట్టింగ్ చేయగల సమర్థులు ఉన్నారని అన్నాడు. ఇంగ్లండ్ కూడా వరల్డ్ కప్ టైటిల్ ఫేవరేట్ అని చెప్పడానికి ఇది సరిపోదా? అని ఎదురు ప్రశ్నించాడు. బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో అద్భుతమైన ప్రతిభావంతులు తమ జట్టు సొంతమని వ్యాఖ్యానించాడు. తాజాగా సఫారీలతో జరిగిన వన్డే సిరీస్ కోల్పోవడం బాధించిందని తెలిపిన హేల్స్, టీట్వంటీ వరల్డ్ కప్ లో సత్తా చాటుతామని అన్నాడు. సఫారీలతో జరిగిన సిరీస్ లో తొలి నాలుగు వన్డేల్లో అర్ధ సెంచరీలతో రాణించిన హేల్స్ చివరి వన్డేలో సెంచరీ సాధించాడు.