: చివరికి మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారు: దర్శకుడ్ని నిష్టూరమాడిన కరీనా కపూర్
'మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారంటూ' బాలీవుడ్ నటి కరీనా కపూర్ ఖాన్ 'కీ అండ్ కా' దర్శకుడు బాల్కీని నిష్టూరమాడింది. అర్జున్ కపూర్, కరీనా కపూర్ జంటగా నటిస్తున్న 'కీ అండ్ కా' ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ముంబైలో నిర్వహించారు. ఈ సందర్భంగా మీడియా కరీనా కపూర్ కు ప్రశ్నలు సంధించింది. ఈ సినిమాతో పెళ్లి తరువాత ముద్దు సీన్లలో నటించననే పాలసీకి చరమగీతం పాడినట్టున్నారు? అంటూ మీడియా అడిగింది. దానికి కరీనా స్పందిస్తూ, 'ఇలాంటి పాలసీ ఉందని తెలుసు...అయితే ఆ పాలసీ ఎక్కడి నుంచి వచ్చిందో మాత్రం తెలీదు' అంటూ దాటవేత ధోరణిలో సమాధానమిచ్చింది. అదే సమయంలో దర్శకుడు బాల్కీని చూస్తూ...'చివరికి మీరు నాకు విడాకులు ఇప్పించేలా ఉన్నారు' అంటూ సరదాగా నిష్టూరమాడింది. ఈ సినిమాలో అర్జున్, కరీనాల మధ్య లిప్ లాక్ సన్నివేశం ఉంది. ఈ సన్నివేశం చిత్రీకరించిన సందర్భంగా తీసిన ఫోటోతో విడుదల చేసిన పోస్టర్ బాలీవుడ్ లో హల్ చల్ చేస్తోంది. కాగా, సైఫ్ అలీ ఖాన్ తో వివాహానంతరం ముద్దు సన్నివేశాలకు దూరంగా ఉన్న కరీనా కపూర్ ఖాన్, ఈ సినిమాతో మళ్లీ ముద్దు సన్నివేశంలో నటించడం విశేషం.