: నేను షారూఖ్ అభిమానిని...'డర్' తరహాలో ప్రేమించా!: 'దీప్తి సర్నా' కిడ్నాపర్


స్నాప్ డీల్ ఉద్యోగి దీప్తి సర్నా కిడ్నాప్ మిస్టరీని పోలీసులు ఛేదించారు. ఈ కేసులో ఐదుగురిని అరెస్టు చేసి అసలు నిజం కక్కించారు. ఈ కేసులో ప్రధాన నిందితుడు దేవేంద్ర కుమార్ ఒకరోజు దీప్తి సర్నాని ఘజియాబాద్ రాజీవ్ చౌక్ మెట్రో స్టేషన్లో చూశాడు. తొలి చూపులోనే ఆమెను గాఢంగా ప్రేమించాడు. దీనికి తోడు దేవేంద్ర కుమార్ బాలీవుడ్ హీరో షారూఖ్ ఖాన్ కి వీరాభిమాని. దీంతో దీప్తి సర్నాను ప్రేమలో దింపేందుకు 1993లో విడుదలైన షారూఖ్ సినిమా'డర్'ను స్పూర్తిగా తీసుకున్నాడు. దీంతో ఆమె ఎక్కడికి వెళ్తే అక్కడికి వెళ్లాడు. సినిమాలు, ఆఫీసు, ఇల్లు ఎప్పుడెప్పుడు... ఎక్కడికి వెళుతుంది... ఏం చేస్తుంది... వంటివన్నీ గమనించాడు. చివరిగా ఆమెను కిడ్నాప్ చేయించాలని ప్లాన్ వేశాడు. పాత నేరస్తుడైన దేవేందర్ ఆమెను కిడ్నాప్ చేసేందుకు మెట్రో స్టేషన్ లో రెండు సీఎన్జీ ఆటోలను కొనిపెట్టాడు. అప్పటికి 150 సార్లు ఆమెను కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించాడు. అయితే ఆమె మెట్రోలో ఎప్పుడూ మహిళా కంపార్ట్ మెంట్ లోకి మాత్రమే ఎక్కుతుండడంతోను, స్టేషన్ దిగగానే ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె తండ్రి వస్తుండడంతోను, ఆమెను కిడ్నాప్ చేయడం సాధ్యమయ్యేది కాదు. చివరికి ఎలా అయితేనేమి ఈ సారి ప్లాన్డ్ గా కిడ్నాప్ పథకం రచించాడు. నలుగురి సాయం తీసుకున్నాడు. ఇందులో ఇన్వాల్వ్ అయితే కోటి రూపాయలు హవాలా మార్గంలో వస్తాయని నమ్మబలికాడు. నేర చరిత్ర ఉన్న దేవేందర్ అలా చెప్పడంతో వారు కూడా ఓకే అనేశారు. దీంతో వీరంతా కలిసి దీప్తిని బెదిరించి కిడ్నాప్ చేశారు. అనంతరం ఆమెకు మంచి భోజనం కూడా పెట్టించాడు. ఆ తర్వాత తన మిత్రుల నుంచి ఆమెను రక్షించానని నమ్మబలికాడు. వారిని తప్పించేశానని, ఇక క్షేమంగా ఇంటికి వెళ్లవచ్చని ఆమెకు రైలు చార్జీ కింద డబ్బులు కూడా ఇచ్చాడు. దీంతో 'డర్' సినిమా తరహాలో షారూఖ్ ను జూహీ ప్రేమించినట్టు తనను దీప్తి సర్నా ప్రేమిస్తుందని భావించాడు. చివరికి ఈ కేసును పోలీసులు ఛేదించడంతో ప్రస్తుతం జైలులో ఉన్నాడు. విచారణ సందర్భంగా 'నాపై ఎలాగూ మర్డర్ కేసులు ఉన్నాయి. ప్రేమ కేసు ఉంటే తప్పా, సర్?' అని సబ్ ఇన్ స్పెక్టర్ ను ప్రశ్నించాడంటే వీడి ప్రేమ పిచ్చి ఏ స్థాయిలో ఉందో అర్ధం చేసుకోవచ్చు. దేవేందర్ తో పాటు అతనికి సహకరించిన ప్రదీప్, ఫహిమ్, మోహిత్, మాజిద్ అనే నలుగురిని అరెస్టు చేసి విచారిస్తున్నారు.

  • Loading...

More Telugu News