: కేసీఆర్ చతురతే... అప్పుడు గెలిచింది 63, ఇప్పుడు బలం 82!


దాదాపు 20 నెలల క్రితం అసెంబ్లీ ఎన్నికల సమయంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ గుర్తుపై పోటీ చేసిన వారిలో 63 మంది గెలువగా, ఇప్పుడు టీఆర్ఎస్ గొడుగు నీడన ఉన్న ఎమ్మెల్యేల సంఖ్య 82కు పెరిగింది. అలాగే, ప్రజలు ఇప్పుడు కేసీఆర్ కు నీరాజనాలు పలుకుతున్నారు. ఏ ఎన్నికలు జరిగినా అఖండ మెజారిటీని కట్టబెడుతున్నారు. కేసీఆర్ 'ఆకర్ష్'తో వివిధ పార్టీలకు చెందిన 18 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలో చేరారు. మొట్టమొదట బహుజన్ సమాజ్ పార్టీ నుంచి పోటీ చేసి అనుకోని రీతిలో విజయం సాధించిన ఇంద్రకరణ్ రెడ్డి, ఆపై కోనప్ప చేరగా, ఆపై మరో 16 మంది అదే దారిలో నడిచారు. వీరిలో టీడీపీ నుంచి గెలిచిన తలసాని శ్రీనివాస్ యాదవ్, చల్లా ధర్మారెడ్డి, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, మాధవరం కృష్ణారావు, సాయన్న, వివేకానంద, ఎర్రబెల్లి, ప్రకాశ్ గౌడ్, రాజేందర్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఇదే సమయంలో కాంగ్రెస్ నుంచి నలుగురు, వైఎస్సార్ సీపీకి చెందిన ఇద్దరు టీఆర్ఎస్ లో చేరిపోయారు. తాజాగా కాంగ్రెస్ సిట్టింగ్ స్థానంగా ఉన్న నారాయణ్ ఖేడ్ నుంచి భూపాల్ రెడ్డి గెలవడంతో టీఆర్ఎస్ సభ్యుల సంఖ్య మొత్తం 82కు పెరిగింది. కాగా, ప్రస్తుతం తెలంగాణ అసెంబ్లీలో తెరాసకు 82, కాంగ్రెస్‌ కు 16, ఎంఐఎం‌కు 7, టీడీపీకి 5, బీజేపీకి 5గురు ఎమ్మెల్యేలు ఉండగా, వైకాపా, సీపీఐ, సీపీఎంలకు ఒక్కో ఎమ్మెల్యే ఉన్నారు. ఈ లెక్కలను బట్టి చూస్తే, జూన్ లో రెండు రాజ్యసభ సీట్లకు జరిగే ఎన్నికల్లో రెండింటినీ టీఆర్ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది.

  • Loading...

More Telugu News