: 'నా కథ బాధాకరమే అయినా, వారి కథలు ఇంకా హృదయవిదారకం' అంటున్న యువతి!


ఆమె పేరు నాడియా మురాద్ (21). ప్రస్తుతం లండన్ లో ఉన్నప్పటికీ, కొన్ని నెలల క్రితం వరకూ ఆమె అనుభవించిన నరకం అంతా ఇంతా కాదు. సిరియాలో ఐఎస్ఐఎస్ ఉగ్రవాదులకు పట్టుబడి తనవారందరినీ కళ్లముందే కోల్పోయి, లైంగిక బానిసగా నలిగిపోయి, చావుకు తెగించి తప్పించుకుని వచ్చింది. తన కథను ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ హౌస్ ప్రతినిధులకు వివరిస్తూ, "నా కథ బాధాకరమే. అయితే ఐఎస్ఐఎస్ బందీల్లో ఇంకా నలుగుతున్న ఎందరి వద్దో మరింత హృదయవిదారకమైన వ్యథలున్నాయి" అని చెప్పింది. ప్రస్తుతం 5,800 మంది వరకూ యాజిడి మహిళలు, ఆడపిల్లలు ఉగ్రవాదుల వద్ద బందీలుగా ఉన్నారని తెలిపింది. తమ ఇంటిపై విరుచుకుపడ్డ ఉగ్రవాదులు తన ఆరుగురు సోదరులను, తల్లిని తన కళ్లముందే కాల్చి చంపారని గుర్తు చేసుకుంది. కొన్ని కుటుంబాల్లో పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారని తెలిపింది. తనను మౌసుల్ కు తీసుకువెళ్లి తొలిసారిగా అత్యాచారం చేసిన క్షణాన, తల్లి, సోదరులు మరణించారన్న బాధ మాయమైందని చెబుతూ, వారికి మరణం సులువుగా దగ్గరైందని, అంతకుమించిన బాధ తనదని వెల్లడించింది. అక్కడి నుంచి ఎలా బయటపడాలన్న ఆలోచనే తన మనసు నిండా ఉండేదని పేర్కొంది. సింజార్ నగరంలో కొన్ని చోట్ల 100 మందికి పైగా మహిళల మృతదేహాలను ఒకేచోట పారేసిన ప్రాంతాలు అనేకం ఉన్నాయని తెలిపింది. కేవలం 9 సంవత్సరాల వయసున్న బాలికలను సైతం అద్దెలకు ఇస్తున్నారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చని చెబుతూ, గత రెండు నెలలుగా సిరియాలో యాజిడి మహిళల స్థితిని తాను ప్రపంచానికి తెలియజేస్తున్నానని, ఇస్లాం పేరిట వారిపై జరుగుతున్న అఘాయిత్యాలను రూపుమాపి వారిని సమాజంలోకి తెచ్చేందుకు కృషి చేయాలని నాడియా కోరింది.

  • Loading...

More Telugu News