: భారతీయ రైల్వే 'జర్సీ ఆవు'... పాలు పితకరు, తిండి పెట్టరు: మోదీపై లాలూ వ్యంగ్యోక్తులు
మరో వారంలో పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న వేళ, రాష్ట్రీయ జనతాదళ్ చీఫ్ లాలూ ప్రసాద్ యాదవ్ కేంద్రంపై, ప్రధాని మోదీపై తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు గుప్పించారు. భారతీయ రైల్వేలు 'జర్సీ ఆవు' వంటిదని వ్యాఖ్యానించిన ఆయన, మోదీ ప్రభుత్వం పాలు పిండుకోలేకపోతున్నదని, కనీసం తిండి పెట్టి చూసుకోలేకపోతున్నదని అన్నారు. రైల్వే శాఖకు 'అచ్చే దిన్' రాలేదని, పైగా ప్రైవేటు పరం చేసేందుకు అడుగులు పడుతున్నాయని భయంగా ఉందని ప్రధాని మోదీకి రాసిన బహిరంగ లేఖలో లాలూ వ్యాఖ్యానించారు. రైల్వే మంత్రిగా 3వ సారి బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్న సురేష్ ప్రభుకు వాస్తవ పరిస్థితిపై పూర్తి అవగాహన ఉందన్నారు. రైల్వేలను అభివృద్ధి చేయడానికి సమయం మించిపోలేదని, ఇప్పటికైనా కళ్లు తెరవాలని సూచించారు. అటు పాలు పితక్కుండా, తిండీ పెట్టకుండా ఉంటే ఆవు ఒట్టి పోతుందని, అటువంటి పరిస్థితే రైల్వేలకు రాకుండా చూసుకోవాలని సలహా ఇచ్చారు.