: తెలంగాణలో శిల్పాశెట్టి సెల్ ఫోన్ యూనిట్?
మొన్నటిదాకా ‘ఫార్మా’ హబ్ గా ఉన్న భాగ్యనగరి హైదరాబాదు... తాజాగా సెల్ ఫోన్ తయారీ కేంద్రంగా మారుతోంది. రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణ కేపిటల్ గా మారిన హైదరాబాదులో ఇప్పటికే రెండు సెల్ ఫోన్ తయారీ కంపెనీలు తమ యూనిట్లను ఏర్పాటు చేశాయి. వీటిలో ఒకటి మైక్రోమ్యాక్స్ ది కాగా, మరొకటి సెల్ కాన్ కంపెనీది. దేశీయ సెల్ ఫోన్ తయారీ రంగంలోకి ప్రముఖ బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాతో కలిసి అడుగు పెట్టేసింది. తమ కుమారుడు 'వివాన్’ పేరిట కొత్తగా సెల్ ఫోన్ల తయారీకి ఆ దంపతులు శ్రీకారం చుట్టారు. తాజాగా మహారాష్ట్ర రాజధాని ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వీక్ లో భాగంగా నిన్న శిల్పా దంపతులు తెలంగాణ స్టాల్ వద్ద చాలా సేపు నిలుచున్నారు. హైదరాబాదులో తమ యూనిట్ ఏర్పాటు దిశగా అక్కడి తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన అధికారులతో ప్రాథమిక స్థాయిలో చర్చలు జరిపారు. చర్చల్లో భాగంగా హైదరాబాదులో తమ యూనిట్ స్థాపనకే శిల్పా దంపతులు ఆసక్తి కనబరిచారట. త్వరలోనే దీనిపై మరోమారు సమగ్రంగా చర్చలు జరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు.