: కూతురి కోసం.. పంచాయతీ తీర్పును లెక్కచేయని తండ్రి!


అది రాజస్థాన్ లోని బామర్ జిల్లాలో ఉన్న గుంగా గ్రామం. అక్కడ నివసిస్తున్న గనరాం ప్రజాపత్ అనే వ్యక్తికి ఒక మైనర్ కూతురు ఉంది. ఆమెను 35 ఏళ్ల వ్యక్తికి కట్టబెట్టాలంటూ ఇటీవల ఖాప్ పంచాయతీ పెద్దలు తీర్పు నిచ్చారు. ఈ తీర్పుపై నిరసన వ్యక్తం చేసిన గనరాంకు చేదు అనుభవం ఎదురైంది. తాము చెప్పినట్టు చేయని పక్షంలో రూ.25 లక్షలు జరిమానా చెల్లించాలని, లేదంటే సామాజికంగా బహిష్కరిస్తామని ఈ నెల 1వ తేదీన పంచాయతీ పెద్దలు తీర్పు నిచ్చారు. దీంతో, ఏం చెయ్యాలన్న ఆలోచనలో పడ్డ గనరాం తన బుర్రకు పదునుపెట్టాడు. తన కూతురికి ఆ వివాహం జరగకూడదన్న ఒకే ఒక సంకల్పంతో ఉన్న గనరాం 6వ తేదీన కోర్టును ఆశ్రయించాడు. ఈ సంఘటనకు సంబంధించిన విషయాలన్నింటిని పిటిషన్ ద్వారా కోర్టుకు వివరించాడు. దీంతో, రంగంలోకి దిగిన కోర్టు సదరు ఖాప్ పంచాయతీ పెద్దలపై తక్షణ చర్యలకు ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మొత్తం 17 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా, ఖాప్ పంచాయతీల తీర్పును శిరసావహించడమే తప్ప, ఎదురు తిరిగి పోరాటం చేసే వారు తక్కువమంది ఉంటారు. ఈ తీర్పును ఉల్లంఘించిన వారికి సాంఘిక బహిష్కరణ, కాల్చిపారేయడం వంటి దారుణ శిక్షలను ఖాప్ పంచాయతీ పెద్దలు విధిస్తుంటారు.

  • Loading...

More Telugu News