: ప్రియమైన విద్యార్థులారా... చదువుకుంటామంటే నిధులిచ్చాంగానీ, రాజకీయాలు చేసేందుకు కాదు: మోహన్ దాస్ పాయ్ ఘాటు లేఖ


ఇటీవలి కాలంలో ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయం సహా, పలు యూనివర్శిటీల్లో జరిగిన ఘటనలను ప్రస్తావిస్తూ, ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ, ప్రస్తుతం అరియన్ కాపిటల్ పార్ట్ నర్స్ చైర్మన్ గా ఉన్న మోహన్ దాస్ పాయ్, విద్యార్థులను ఉద్దేశించి ఓ ఘాటైన లేఖ రాశారు. తాము సంపాదించిన డబ్బులో విద్యార్థుల చదువు నిమిత్తం మాత్రమే వితరణ చేస్తున్నామని, రాజకీయాలు చేసేందుకు కాదని ఆయన అన్నారు. విద్యావ్యవస్థ పక్కదారిపడుతోందని ఆరోపించిన ఆయన, కనీసం విద్యాభ్యాసం ముగిసేవరకూ అన్ని రకాల రాజకీయాలను పక్కన బెట్టాలని పిలుపునిచ్చారు. భారత విద్యావ్యవస్థ కుల, మత, ప్రాంతాలుగా విభజనకు గురికావడం పట్ల ఆయన విచారాన్ని వ్యక్తం చేశారు. జేఎన్యూ ఎంతో మంది విద్యాధికులను భారత్ కు అందించిందని, ఇప్పుడు అదే వర్శిటీ ఈ తరహా రాజకీయాలకు పావుగా మారడం తనకెంతో బాధను కలిగిస్తోందని అన్నారు. విద్యార్థులు జాతి వ్యతిరేక నినాదాలు చేయడం సరికాదని మోహన్ దాస్ అభిప్రాయపడ్డారు. జరిగిన ఘటనలను రాజకీయ పక్షాలు తమ ప్రయోజనాలు తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నాయని ఆరోపించారు. ఉగ్రవాది అఫ్జల్ గురుకు మద్దతిస్తున్న కొందరు విద్యార్థులకు స్వయంగా రాహుల్ గాంధీ మద్దతివ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలు కొనసాగితే, విద్యా వ్యవస్థ కుంటుపడుతుందని, విద్యాభివృద్ధికి నిధులిచ్చేవారు వెనుకంజ వేస్తారని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News