: సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారం ఏచూరికి బెదిరింపులు... భద్రతను పెంచిన ప్రభుత్వం
ఢిల్లీలోని జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీలో నెలకొన్న వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతోంది. పార్లమెంటుపై దాడికి పథక రచన చేసిన అఫ్జల్ గురు ఉరితీతను నిరసిస్తూ కొంతమంది విద్యార్థులు ర్యాలీ తీయడం, దానిని ఏబీవీపీ అడ్డుకున్న నేపథ్యంలో వివాదం రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ వివాదాన్ని అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం చేసిన యత్నాలేమీ ఫలించకపోగా, తదనంతర పరిణామాల్లో అది రాజకీయ రంగు పులుముకుంది. నిన్న ఢిల్లీలోని సీపీఎం ప్రధాన కార్యాలయంపై రాళ్ల దాడి జరిగింది. తాజాగా నిన్న రాత్రి పొద్దుపోయిన తర్వాత ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరికి గుర్తు తెలియని వ్యక్తుల నుంచి బెదిరింపులు ఎదురయ్యాయి. రాత్రి ఏచూరికి ఫోన్ చేసిన కొందరు వ్యక్తులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారంటూ ఆయనను హెచ్చరించారు. దీనిపై సమాచారం అందుకున్న ప్రభుత్వం ఆయనకు మరింత భద్రత పెంచింది. అదే సమయంలో దాడి నేపథ్యంలో సీపీఎం కార్యాలయం వద్ద కూడా ప్రభుత్వం భద్రతను పెంచింది.