: గ్రూప్ 1, గ్రూప్ 2 వదులుకున్నా... ఎన్టీఆర్, వైఎస్ మంత్రి పదవులు ఆఫర్ చేశారు: ఆర్.కృష్ణయ్య
తనకు గ్రూప్ 1, గ్రూప్ 2, బ్యాంకు ఆఫీసర్ వంటి ఉద్యోగాలు ఎన్నో వచ్చాయని, వాటన్నింటికీ రాజీనామా చేసి గడచిన 40 సంవత్సరాలుగా బలహీనవర్గాల అభ్యున్నతి కోసం శ్రమిస్తున్నానని బీసీ సంఘాల నేత ఆర్.కృష్ణయ్య వ్యాఖ్యానించారు. ఓ టీవీ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ సీఎంగా తనను చేస్తానని మాటిచ్చిన మీదటే, ఆ పార్టీలో చేరాను తప్ప, తనకు రాజకీయాలంటే పెద్దగా ఇష్టం లేదని అన్నారు. తాను సీఎం అయితే బీసీ జాతి అభివృద్ధి చెందుతుందన్న ఒకే కారణంతో తెలుగుదేశంలో చేరానని అన్నారు. తెలుగుదేశం నేతగాకన్నా, బీసీల్లో ఒకడిగా ఉండటమే తనకు ఇష్టమని చెప్పారు. తాను టెక్నికల్ గా మాత్రమే ఎమ్మెల్యేనని అన్నారు. గతంలోనే తనకు ఎన్టీఆర్ తో పాటు చెన్నారెడ్డి, వైఎస్ రాజశేఖరరెడ్డి తదితరులు మంత్రిపదవులు ఆఫర్ చేశారని గుర్తు చేసుకున్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని అనుకున్నానని, అయితే, తనకు ఓట్లేసేందుకు అమెరికా తదితర దేశాల నుంచి వచ్చిన వారి అభిమానానికి కట్టుబడ్డానని, ప్రజలు చూపిన ప్రేమ చూసి ఎమ్మెల్యే పదవిలో ఉన్నానని అన్నారు.