: తాత్కాలిక అమరావతి టెండర్లు ఖరారు... చదరపు అడుగుకు రూ.3,350
నవ్యాంధ్ర తాత్కాలిక రాజధాని నిర్మాణానికి సంబంధించిన టెండర్లు ఎట్టకేలకు ఖరారయ్యాయి. గుంటూరు జిల్లా పరిధిలోని అమరావతిలో నిర్మించనున్న మూడు భవన నిర్మాణాల్లో రెండింటిని ఎల్ అండ్ టీ దక్కించుకోగా, మరో దానిని షాపూర్జీ పల్లోంజీ సంస్థ కైవసం చేసుకుంది. శరవేగంగా నిర్మాణం జరగాల్సిన ఈ భవనాల నిర్మాణాలకు సంబంధించి ప్రభుత్వం కాంట్రాక్టు సంస్థల ఒత్తిడికి తలొగ్గక తప్పలేదన్న వాదన వినిపిస్తోంది. నోటిఫికేషన్ జారీ సందర్భంగా ప్రభుత్వం కోట్ చేసిన ధర కంటే ఆ రెండు సంస్థలు ఏకంగా 35 శాతం అధిక ధరలను కోట్ చేశాయి. అయితే ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలుగా పేరుగాంచిన ఆ రెండు సంస్థల కంటే మరే సంస్థలు పనులను వేగంగా పూర్తి చేయలేవన్న భావనతో అధిక ధరలను కోట్ చేసినా, వాటితో ప్రభుత్వం చర్చలకు తెర తీసింది. రోజుల తరబడి విజయవాడలో కొనసాగిన చర్చలు నిన్న ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడి సమక్షంలో ఫలప్రదమయ్యాయి. కాంట్రాక్టు సంస్థలు కోట్ చేసిన ధర, ప్రభుత్వం ప్రతిపాదించిన ధరలు కాకుండా.. మధ్యేమార్గంగా చదరపు అడుగుకు రూ.3,350 ఇచ్చేట్లుగా ఓ ప్రతిపాదనకు ఇరు పక్షాలు అంగీకరించాయి. నేడు విజయవాడలో జరగనున్న కేబినెట్ భేటీలో దీనిపై ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుంది. అంతేకాక ఆ వెంటనే కాంట్రాక్టు సంస్థలతో ఒప్పందాలు కూడా కుదుర్చుకోనుంది. పనులు కూడా త్వరలో మొదలు కానున్నట్లు సమాచారం.