: రూ. 1కి పడిపోయిన కిలో టమోటా ధర
నిన్నమొన్నటి వరకూ కొండెక్కి కూర్చున్న ఉల్లి ఇప్పుడు రైతులకు కన్నీరు పెట్టిస్తుంటే, తాజాగా టమోటా సైతం అదే దారిలో నడుస్తోంది. మదనపల్లి మార్కెట్లో ఈ ఉదయం కిలో టమోటా ధర రూ. 1కి పడిపోయింది. దీంతో రవాణా నిమిత్తం లారీలకు చెల్లించిన డబ్బు కూడా వచ్చే పరిస్థితి లేదని రైతులు వాపోతున్నారు. మంచి ధర వస్తుందన్న ఆశతో అత్యధికులు టమోటా పండించారని, దీంతో ఒక్కసారిగా దిగుబడి పెరగినందునే ధరలు పడిపోయాయని మార్కెట్ వర్గాలు వెల్లడించాయి. మార్కెట్ కు టమోటాను చేర్చేందుకు ఒక్కో బాక్స్ కు రూ. 50 వరకూ తమకు ఖర్చు వస్తోందని, బాక్స్ ధర రూ. 60 కూడా పలకడం లేదని అనంతపురం నుంచి రెండు లారీల లోడ్ ను మదనపల్లికి తెచ్చిన రైతు బావురుమన్నాడు. తిరిగి వెనక్కు వెళ్లడానికి బస్సు చార్జీలు మిగిలే పరిస్థితి కూడా లేదని తెలిపాడు. ఎకరాకు రూ. 70 వేల వరకూ ఖర్చు పెడుతుంటే, ఆ మొత్తం కూడా రావడం లేదని ఆరోపించాడు.