: గడ్డం గీసుకుని, చీరలు కట్టుకుని, తప్పించుకునేందుకు ఐఎస్ ముష్కరుల తిప్పలు!
తమ చేతికి చిక్కిన పాశ్చాత్య దేశాలకు చెందిన వ్యక్తుల కుత్తుకలు కోసి, సదరు వీడియోలను సోషల్ మీడియాలో పెట్టి వికటాట్టహాసం చేయడం ద్వారా తమ క్రూరత్వంతో ప్రపంచాన్ని గడగడలాడించిన ఇస్లామిక్ స్టేట్ ఆఫ్ ఇరాక్ అండ్ సిరియా (ఐఎస్ఐఎస్) ఉగ్రవాదులు పలాయనం చిత్తగిస్తున్నారు. ఎంతటి క్రూరత్వానికి పాల్పడ్డారో, అంతకంటే అవమానకర రీతిలో పోలీసుల నుంచి తప్పించుకునేందుకు నానా పాట్లు పడుతున్నారు. పోలీసుల కంటబడకుండా తప్పించుకునే క్రమంలో ఇస్లామిక్ చట్టాలకు విరుద్ధంగా గడ్డం గీసేస్తున్నారు. యాజీదీ మహిళలపై అకృత్యాలకు పాల్పడిన వారు ఇప్పుడు ఆ మహిళలు కట్టే చీరలనే ఆశ్రయించారు. నున్నగా గడ్డం గీసుకుని, చీరలు కట్టుకుని మరీ పలాయనం చిత్తగిస్తున్నారు. అయితే రెండేళ్లుగా భీకర దాడులతో తమ దేశాన్ని అతలాకుతలం చేసిన ఐఎస్ ముష్కరులు ఏ వేషంలో వచ్చినా వదిలేది లేదంటున్న ఇరాకీ సేనలు చీరలు కట్టుకుని వెళుతున్న ఐఎస్ టెర్రరిస్టులను పట్టేశారు. ఈ ఘటన గత వారంలో చోటుచేసుకున్నట్లు ఇరాక్, సిరియా, జోర్డాన్ తదితర ప్రాంతాలకు చెందిన లోకల్ మీడియా ‘ఆరా న్యూస్’ ఆసక్తికర కథనాలు రాసింది. ఈ కథనాల ప్రకారం... గతంలో ఇరాకీ నగరం రమదీని ఐఎస్ ఉగ్రవాదులు తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. అయితే అమెరికా సేనల సహకారంతో ఇరాకీ సేనలు జరిపిన ముప్పేట దాడుల్లో ఆ నగరంలోని మెజారిటీ ఉగ్రవాదులు హతమయ్యారు. నగరాన్ని గత వారం ఇరాకీ సేనలు తిరిగి తమ స్వాధీనంలోకి తీసుకున్నాయి. అయితే నగరంలో ఇంకా ఉగ్రవాదులున్నారన్న సమాచారంతో సేనలు ఇంటింటినీ సోదా చేయడం ప్రారంభించాయి. ఈ క్రమంలో సేనల నుంచి తప్పించుకునేందుకు ఉగ్రవాదులు నానా తిప్పలు పడ్డారు. కేలిఫేట్ పేరిట ప్రత్యేక ఇస్లామిక్ రాజ్య స్థాపన కోసమంటూ బరిలోకి దిగిన ఉగ్రవాదులు సేనల ముమ్మర సోదాలతో తోకముడవడంతో పాటు ఇస్లామిక్ చట్టాలనే పక్కన పెడుతున్నారు. అప్పటిదాకా పెంచుకున్న పొడవాటి గడ్డాన్ని నున్నగా గీకేశారు. అంతేకాక మేనికి చీరలు చుట్టేశారు. ఆపై తాము దాక్కున్న ఇళ్లల్లో నుంచి బయటకు వచ్చి సైనికులు ఏర్పాటు చేసిన చెక్ పోస్టుల నుంచే తప్పించుకునేందుకు యత్నించారు. అయితే 24 గంటల పాటు అప్రమత్తంగా ఉంటున్న ఇరాకీ సేనలు చీరల్లో తప్పించుకునేందుకు యత్నించిన 9 మంది ఐఎస్ ఉగ్రవాదులను గుర్తించి అరెస్ట్ చేశాయి.