: ‘మేకిన్ ఇండియా’ వేదికపై మంటలు... ముంబైలో తృటిలో తప్పిన పెను ప్రమాదం


దేశ వాణిజ్య రాజధాని ముంబైలో జరుగుతున్న ‘మేకిన్ ఇండియా’ వీక్ లో భారీ ప్రమాదం సంభవించింది. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా ప్రారంభించిన ఈ భారీ ఈవెంట్ లో నిన్న రాత్రి కల్చరల్ ఈవెంట్స్ జరుగుతుండగానే చెలరేగిన మంటలు కాసేపట్లోనే మొత్తం వేదికనే దహించివేశాయి. అయితే వేగంగా స్పందించిన పోలీసులు ప్రమాద సమయంలో అక్కడే ఉన్న పలువురు ప్రముఖులతో పాటు జనాన్ని క్షణాల్లో అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలించగలిగారు. మొత్తం వేదికనే మంటలు దహించి వేసిన ఈ ప్రమాదంలో ఒక్కరంటే ఒక్కరికి కూడా గాయాలు కాకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నారు. వివరాల్లోకెళితే... మేకిన్ ఇండియా ప్రమోషన్ లో భాగంగా మూడు రోజుల క్రితం ప్రధాని నరేంద్ర మోదీ ముంబైలో ఈ భారీ ఈవెంట్ ను ప్రారంభించారు. ఈవెంట్ లో భాగంగా నిన్న రాత్రి కల్చరల్ ప్రోగ్రామ్స్ హోరెత్తాయి. ఈ వేడుకలకు మహారాష్ట్ర గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావు, ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్, మహారాష్ట్ర కేబినెట్ మంత్రులతో పాటు బాలీవుడ్ ప్రముఖులు అమితాబ్ బచ్చన్, ఆమిర్ ఖాన్ తదతరులతో పాటు పెద్ద సంఖ్యలో ప్రముఖులు హాజరయ్యారు. అమితాబ్ బచ్చన్ వేదికకు ముందున్న తొలి వరుసలోనే ఆసీనులయ్యారు. ఈ సందర్భంగా వేదికపై కళాకారులు నృత్యాలు చేస్తుండగానే దట్టమైన పొగలు వ్యాపించాయి. ఏర్పాట్లలో భాగంగానే పొగలు వచ్చాయని భావించిన కళాకారులు, ఆహూతులు పొగలను అంతగా పట్టించుకోలేదు. అయితే పొగల నుంచి చిన్న చిన్నగా మంటలు వ్యాపిస్తుండటంతో పోలీసులు వేగంగా స్పందించారు. వేదికపై ఉన్న కళాకారులతో పాటు అక్కడ ఉన్న ప్రముఖులను క్షణాల్లో సురక్షిత ప్రాంతానికి తరలించారు. జనం అక్కడి నుంచి కాస్తంత దూరం వెళ్లగానేే వేదిక మొత్తం తగలబడిపోయింది. పోలీసులు ఏమాత్రం ఆలస్యం చేసినా, పెను ప్రమాదమే సంభవించేది. దీనిపై సమాచారం అందుకున్న ప్రధాని మోదీ వెంటనే ఫడ్నవీస్ కు ఫోన్ చేసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మొత్తం ఘటనపై సమగ్ర దర్యాప్తునకు ఆదేశిస్తున్నట్లు ఆ తర్వాత ఫడ్నవీస్ ప్రకటించారు.

  • Loading...

More Telugu News