: చెలరేగిన ధోనీ సేన... 9 వికెట్లతో లంకపై విజయం, సిరీస్ కైవసం
టీ20ల్లో నిజంగా టీమిండియాను మించిన జట్టు లేదేమో! ఇటీవలే ఆస్ట్రేలియా పర్యటనలో ఆ దేశ జట్టును టీ20 సిరీస్ లో వైట్ వాష్ చేసిన ధోనీ సేన, నిన్నటి మ్యాచ్ లో శ్రీలంక జట్టుపై ఏకంగా 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. వెరసి పొట్టి ఫార్మాట్ లో వరుసగా రెండో సిరీస్ ను గెలుచుకోవడమే కాక, ఈ ఫార్మాట్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. నిన్న రాత్రి సాగర నగరం విశాఖపట్నంలోని డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి వీసీఏ-వీడీసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్ లో టాస్ గెలిచి తొలుత బౌలింగ్ ను ఎంచుకున్న కెప్టెన్ కూల్ మహేంద్రసింగ్ ధోనీ, పర్యాటక జట్టును ఫస్ట్ బ్యాటింగ్ కు ఆహ్వానించాడు. ధోనీ నిర్ణయం సరైనదేనని టీమిండియా స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ నిరూపించాడు. టీమిండియా బౌలింగ్ ను ప్రారంభించిన అశ్విన్ తొలి ఓవర్ లోనే రెండు వికెట్లు తీశాడు. మూడో బంతికి నిరోశాన్ డిక్ వెల్లా(1), చివరి బంతికి తిలకరత్నే దిల్షాన్ (1)ను అశ్విన్ బోల్తా కొట్టించాడు. ఆ తర్వాత తన రెండో (ఇన్నింగ్స్ మూడో) ఓవర్ లోనూ చెలరేగిన అశ్విన్ లంక కెప్టెన్ దినేశ్ చండీమాల్ (8)ను కూడా పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత లంక బ్యాట్స్ మెన్ వరుసగా పెవిలియన్ కు క్యూ కట్టారు. నాలుగు ఓవర్లు వేసిన అశ్విన్ మొత్తం 8 పరుగులిచ్చి నాలుగు వికెట్లు తీశాడు. ఇక మిస్టరీ స్పిన్నర్ గా పేరున్న సురేశ్ రైనా రెండు వికెట్లు తీశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్ల పాటు క్రీజులో నిలబడలేకపోయిన లంక 18 ఓవర్లకే చాప చుట్టేసింది. కేవలం 82 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత 83 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన ధోనీ అండ్ గ్యాంగ్... సింగిల్ వికెట్ కోల్పోయి కేవలం 13.5 ఓవర్లలోనే 84 పరుగులు చేసింది. భారత ఇన్నింగ్స్ ను ప్రారంభించిన స్టైలిష్ బ్యాట్స్ మన్ రోహిత్ శర్మ (13) నిరాశ పరచగా, మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (46) మరోమారు చెలరేగాడు. రోహిత్ వెనుదిరగడంతో ధావన్ తో జతకలిసిన అజింక్యా రెహానే (22) జట్టును విజయతీరాలకు చేర్చాడు. వెరసి సింగిల్ వికెట్ మాత్రమే చేజార్చుకున్న టీమిండియా లంకపై ఘన విజయంతో పాటు సిరీస్ ను కైవసం చేసుకుంది. టీ20 ర్యాంకింగ్స్ లో అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది.