: మరణశిక్షల అమలుకు విషం దొరకడం లేదట... 'విద్యుత్ కుర్చీ'కి వర్జీనియా మొగ్గు!
మరణశిక్షలను అమలు చేసేందుకు అవసరమైన విష రసాయనాలు అందుబాటులో ఉండకపోవడంతో, విద్యుత్ కుర్చీ (ఎలక్ట్రిక్ చైర్)లను వాడే విధానానికి అనుమతినిస్తూ, అమెరికాలోని వర్జీనియా ప్రజా ప్రతినిధులు కొత్త బిల్లును ఆమోదించనున్నారు. వర్జీనియాలో మరణశిక్షలను విషపు (లెథల్) ఇంజక్షన్ ఇవ్వడం ద్వారా అమలు చేస్తుండగా, ఇటీవలి కాలంలో ఈ తరహా ఔషధాల లభ్యత మందగించింది. దీంతో వర్జీనియా 'హౌస్ ఆఫ్ డెలిగేట్స్' ఎలక్ట్రిఫికేషన్ వైపు నడుస్తున్నారు. "కోర్టుల నిర్ణయాన్ని అమలు చేయాల్సిన బాధ్యత మాపై ఉంది. అందుకోసమే ఈ కొత్త బిల్లు" అని బిల్లును ప్రవేశపెట్టిన జాక్సన్ హెచ్ మిల్లర్ వ్యాఖ్యానించారు. కాగా కుర్చీలో కూర్చోబెట్టి, కాళ్లూ చేతులూ గట్టిగా కట్టి, విద్యుత్ షాక్ ఇవ్వడం ద్వారా మరణించేలా చూడటం అత్యంత దారుణమైనదని భావిస్తూ, చాలా దేశాలు దీనిపై నిషేధాన్ని విధించాయి. విషంతో కూడిన ఇంజక్షన్ ఇస్తే, మెల్లగా మత్తులోకి జారుకుని మరణిస్తారని, దీనివల్ల అతి తక్కువ బాధ, మరణానికి చేరువయ్యేందుకు తక్కువ సమయం పడుతుందనే భావనలో చాలా దేశాలు ఈ విధానాన్నే అమలు చేస్తున్నాయి.