: భారత బ్యాంకింగ్ చరిత్రలోనే అత్యధిక నష్టంలో బ్యాంక్ ఆఫ్ బరోడా!


భారత బ్యాంకింగ్ రంగ చరిత్రలో అత్యధిక నష్టాన్ని ప్రభుత్వ రంగ బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) చూపించింది. డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో బ్యాంకు నికర నష్టం రూ. 3,342 కోట్లని తెలిపింది. ఇండియాలో ఓ బ్యాంకు మూడు నెలల కాల పరిధిలో ప్రకటించిన అత్యధిక నష్టం ఇదే కావడం గమనార్హం. బ్యాంకు ఇచ్చిన రుణాలు వసూలు కాకపోవడం, బ్యాడ్ లోన్స్ ఐదు రెట్లు పెరగడం ఇందుకు కారణమని తెలుస్తోంది. 2014-15తో పోలిస్తే బ్యాంకుకు వడ్డీల రూపంలో వచ్చిన ఆదాయం రూ. 3,26 కోట్ల నుంచి రూ. 2,795 కోట్లకు తగ్గింది. ఇండియాలో ఆస్తుల పరంగా రెండవ అతిపెద్ద బ్యాంకుగా ఉన్న బ్యాంక్ ఆఫ్ బరోడాలో గత సంవత్సరం మూడవ త్రైమాసికంలో రూ. 1,149 కోట్ల బ్యాడ్ లోన్స్ నమోదు కాగా, అవి ఈ సంవత్సరం రూ. 6,474 కోట్ల విలువకు చేరాయి. కాగా, దాదాపు ఐదేళ్ల తరువాత త్రైమాసిక లాభాల్లో అతిపెద్ద పతనాన్ని నమోదు చేస్తూ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్థిక ఫలితాలు వెల్లడైన తరువాత బీఓబీ గణాంకాలు విడుదల కావడం గమనార్హం. నిరర్థక ఆస్తులపై మరింత అప్రమత్తంగా ఉండాలని, రుణాల మంజూరులో నిబంధనలు కఠినం చేయాలని ఇప్పటికే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంకర్లను కోరిన సంగతి తెలిసిందే.

  • Loading...

More Telugu News