: గుమ్నామీ బాబా ఎవరన్న సంగతి తేల్చండి: యూపీ సీఎంతో నేతాజీ కుటుంబీకులు
ఉత్తరప్రదేశ్ లోని ఫజియాబాద్ లో గుమ్నామీ బాబా పేరిట నేతాజీ సుభాష్ చంద్రబోస్ రహస్య జీవితం గడిపారని ఎంతో మంది ప్రజలు నమ్ముతున్న వేళ, అసలు గుమ్నామీ బాబా ఎవరన్న సంగతి తేల్చాలని నేతాజీ కుటుంబీకులు కోరుతున్నారు. యూపీ ముఖ్యమంత్రి అఖిలేశ్ తో ఆయన నివాసంలో సమావేశమైన నేతాజీ వారసులు ఈ మేరకు విచారణ జరిపేందుకు ఓ కమిటీని నియమించాలని కోరారు. 1985 వరకూ హిందూ సన్యాసిగా నివసించిన గుమ్నామీ బాబా అలియాస్ భగవాన్ జీ అసలు ఐడెంటిటీని గుర్తించాలని వారు కోరారు. గుమ్నామీ బాబాకు సంబంధించిన అన్ని వివరాలు మరోసారి పరీక్షిస్తామని, ఈ విషయంలో కమిటీని నియమించేందుకు త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని ముఖ్యమంత్రి కార్యాలయం ఓ ప్రకటనలో తెలిపింది. నేతాజీ వారసులు జయంతి రక్షిత్, ఆమె భర్త అమేయ్ రక్షిత్, ఆర్యాబోస్ తదితరులు అఖిలేశ్ ను కలిసిన వారిలో ఉన్నారు.