: తలాక్ చెప్పిన యూపీ జడ్జి!... సుప్రీం చీఫ్ జస్టిస్ ను ఆశ్రయించిన భార్య!
నోటి మాటే కాక సోషల్ మీడియా ద్వారానైనా మూడు సార్లు ‘తలాక్’ చెబితే విడాకులిచ్చేసినట్లేనన్న ముస్లిం పర్సనల్ లా బోర్డు నిర్ణయంపై ముస్లిం సామాజిక వర్గానికి చెందిన ఓ మహిళ పోరు సాగిస్తోంది. అది కూడా తీర్పులిచ్చే గురుతర బాధ్యతల్లో ఉన్న ఓ జడ్జి భార్య ఈ పోరుకు శ్రీకారం చుట్టింది. నోటి మాటతో ‘తలాక్’ చెప్పేవారిని కటకటాల వెనక్కి నెట్టాలని ఆమె ఏకంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టీఎస్ ఠాకూర్, అలహాబాదు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మతీన్ అహ్మద్ లకు ఆమె లేఖ రాశారు. వివరాల్లోకెళితే... ఉత్తరప్రదేశ్ లోని అలీగఢ్ జిల్లా అదనపు న్యాయమూర్తిగా పనిచేస్తున్న మొహ్మద్ జహీరుద్దీన్ సిద్ధిఖీ... మొదటి భార్య చనిపోగా గతేడాది ఆగస్టు 16న అష్ఫా ఖాన్ అనే మహిళను రెండో వివాహం చేసుకున్నారు. అంగరంగ వైభవంగా జరిగిన ఈ పెళ్లికి సిద్ధికీ తొలి భార్య ద్వారా కలిగిన కుమారులు కూడా హాజరయ్యారట. తాజాగా అష్పా ఖాన్ పై ఒకానొక సందర్భంలో అంతెత్తున ఎగిరిపడ్డ సిద్ధిఖీ మూడు సార్లు ‘తలాక్’ చెప్పేశారట. అంతేకాక ‘తలాక్’ చెప్పానుగా అంటూ ఆమెను ఇంటిలో నుంచి వెళ్లగొట్టారు. దీంతో తనకు న్యాయం చేయాలని అష్ఫా ఖాన్ సీజేఐతో పాటు అలహాబాదు హైకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖలు రాశారు. తనకు తలాక్ చెప్పిన సిద్ధిఖీ, ఆయన కుటుంబ సభ్యులు తనపై హింసకు కూడా దిగారని కూడా ఆ లేఖలో అష్ఫా ఖాన్ ఫిర్యాదు చేసింది. మరి దీనిపై సుప్రీంకోర్టు, అలహాబాదు హైకోర్టు ఏవిధంగా స్పందిస్తాయో చూడాలి.