: ఢిల్లీలో కేసీఆర్... సెక్రటేరియట్ లో మనవడు హిమాన్షు హల్ చల్!
టీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. మొన్న రాత్రి హస్తిన వెళ్లిన ఆయన నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. నేడు కూడా ఆయన ఢిల్లీలో బిజీబిజీగా గడపనున్నారు. కేంద్ర హోం శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ సహా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. కేసీఆర్ ఢిల్లీ పర్యటనలో ఉన్న వేళ... ఆయన మనవడు, కేటీఆర్ కుమారుడు కల్వకుంట్ల హిమాన్షు సెక్రటేరియట్ లో హల్ చల్ చేశాడు. కాన్వాయ్ తో కూడిన కారులో సచివాలయంలోని సమత బ్లాకుకు వచ్చిన హిమాన్షు నేరుగా తన తాత కార్యాలయం(సీఎంఓ)లోకి వెళ్లాడు. కేసీఆర్ చాంబర్ తో పాటు సీఎంఓలోని ఉన్నతాధికారుల చాంబర్లను కూడా అతడు పరిశీలించాడు. ఇద్దరు స్నేహితులతో కలిసి వచ్చిన హిమాన్షు హల్ చల్ చేశాడు. సీఎం లేని సమయంలో హిమాన్షు సీఎంఓలో అడుగుపెట్టడం గమనార్హం.