: హరీశ్ సత్తాకు పరీక్ష నేడు... మరికాసేపట్లో ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్
టీఆర్ఎస్ సీనియర్ నేత, తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు సత్తాకు నిజంగా నేడు పరీక్ష జరగనుంది. అన్నీ తానై వ్యవహరించిన మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ ఉప ఎన్నిక పోలింగ్ మరికాసేపట్లో ప్రారంభం కానుంది. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.కిష్టారెడ్డి హఠాన్మరణంతో ఖేడ్ కు ఉప ఎన్నిక అనివార్యమైంది. చట్టసభలో సభ్యుడిగా ఉండి చనిపోతే, సదరు సభ్యుడి కుటుంబ సభ్యులకే ఆ పదవిని ఏకగ్రీవంగా అప్పగించాలన్న సంప్రదాయానికి తిలోదకాలిచ్చిన టీఆర్ఎస్, ఉప ఎన్నికకు తెర తీసింది. ప్రధానంగా కాంగ్రెస్, టీఆర్ఎస్ ల మధ్యే నెలకొన్న పోటీలో ఇరు పార్టీలు విజయం కోసం శ్రమటోడ్చి ప్రచారం చేశాయి. మొన్నటి గ్రేటర్ హైదరాబాదు మునిసిపల్ ఎన్నికల బాధ్యతలను తన కొడుకు కేటీఆర్ కు అప్పగించిన టీఆర్ఎస్ అధినేేత, సీఎం కేసీఆర్... ఖేడ్ ఉప ఎన్నికను మేనల్లుడు హరీశ్ రావుకు అప్పగించారు. ఈ క్రమంలో ఖేడ్ లోనే తిష్ట వేసిన హరీశ్ రావు తనదైన శైలిలో నియోజకవర్గాన్ని చుట్టేశారు. టీఆర్ఎస్ అభ్యర్థి భూపాల్ రెడ్డిని గెలిపిస్తే, ఖేడ్ ను తన నియోజకవర్గం సిద్దిపేట తరహాలో తీర్చిదిద్దుతానని ఆయన ప్రకటించారు. ఈ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థిని గెలిపించడం ద్వారా తన సత్తా చాటాలని ఆయన ఉవ్విళ్లూరుతున్నారు. ఇక కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగిన కిష్టారెడ్డి కొడుకు సంజీవరెడ్డి కూడా విజయంపై ధీమాగానే ఉన్నారు. నేటి సాయంత్రం దాకా జరగనున్న పోలింగ్ కు అధికార యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది.