: శ్రీలంక వికెట్లను పంచుకుంటున్న అశ్విన్, నెహ్రా...శ్రీలంక 40/3


బ్యాటింగ్ లో సత్తాచాటిన టీమిండియా బౌలింగ్ లో కూడా ఆకట్టుకుంటోంది. 197 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన శ్రీలంకను తొలి ఓవర్లో రవిచంద్రన్ అశ్విన్ దెబ్బ కొట్టాడు. ధోనీ వ్యూహంతో తొలి ఓవర్ ను సంధించిన అశ్విన్ తొలి బంతిని వైడ్ గా వేశాడు. దీంతో బంతులేమీ ఆడకుండానే లంక ఖాతాలో రెండు పరుగులు వచ్చాయి. ఈ ఆనందం ఆవిరయ్యేలా తరువాతి బంతిని ఆఫ్ స్టంప్ పై సంధించిన అశ్విన్, దిల్షాన్ (0) ను బోల్తాకొట్టించాడు. బంతిని అందుకున్న ధోనీ రెప్పపాటులో వికెట్లను గిరాటేశాడు. దీంతో తొలి బంతికే శ్రీలంక తొలి వికెట్ కోల్పోయింది. తరువాతి ఓవర్ రెండో బంతితో ఆశిష్ నెహ్రా బోల్తా కొట్టించగా, భారీ షాట్ కు యత్నించిన ప్రసన్న (1) యువరాజ్ అద్భుత క్యాచ్ కు పెవిలియన్ చేరాడు. నాలుగో ఓవర్ లో నెహ్రా సంధించిన బంతి ఇన్ సైడ్ ఎడ్జ్ తీసుకుని ధోనీ చేతుల్లో ఒదిగిపోవడంతో మూడో వికెట్ రూపంలో గుణతిలక (2) పెవిలియన్ చేరాడు. అనంతరం కెప్టెన్ చండిమాల్ (16) తో కపుగెదర (16) స్కోరు బోర్డును నడిపిస్తున్నాడు. ఏడు ఓవర్లు ఆడిన శ్రీలంక మూడు వికెట్ల నష్టానికి 40 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లలో నెహ్రా రెండు, అశ్విన్ ఒక వికెట్ తీశారు.

  • Loading...

More Telugu News