: భారీ స్కోరు సాధించిన టీమిండియా...పెరీరా హ్యాట్రిక్... శ్రీలంక టార్గెట్ 197


భారత జట్టు భారీ స్కోరు సాధించింది. కీలక సమయాల్లో వికెట్లు తీసినప్పటికీ భారత్ భారీ స్కోరును మాత్రం శ్రీలంక జట్టు అడ్డుకోలేకపోయింది. టాస్ ఓడి బ్యాటింగ్ ప్రారంభించిన టీమిండియాకు ఓపెనర్లు శిఖర్ ధావన్ (51), రోహిత్ శర్మ (43) అద్భుతమైన ఆరంభం ఇచ్చారు. వీరి జోరుతో తొలి ఏడు ఓవర్లలోనే 70 పరుగులు సాధించారు. ధావన్ అవుటైన అనంతరం రోహిత్ తో కలసి అజింక్య రహానే (25) జాగ్రత్తగా ఆడాడు. దీంతో పదకొండో ఓవర్ లో టీమిండియా సెంచరీ మార్కును దాటింది. వెంటనే రోహిత్, రహానే అవుటవ్వడం టీమిండియా స్కోరు బోర్డు వేగాన్ని తగ్గించింది. అనంతరం రైనా (30) హార్డిక్ పాండ్య (27) వేగంగా ఆడారు. అనంతరం రైనా, పాండ్య, యువరాజ్ సింగ్ (0) లను వరుస బంతుల్లో అవుట్ చేసిన పెరీరా టీట్వంటీలో నాలుగవ హ్యాట్రిక్ నమోదు చేశాడు. దీంతో ఒక్కసారిగా టీమిండియా పరుగులు ఆగిపోయి, వికెట్ల పతనం మొదలైంది. అనంతరం ఆడిన ధోనీ (7), జడేజా (1) నాటౌట్ గా నిలిచారు. దీంతో టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయిన భారత జట్టు 196 పరుగులు చేసింది. శ్రీలంక బౌలర్లలో హ్యాట్రిక్ తో పెరీరా రాణించగా, చమీర రెండు, సేనానాయకే ఒక వికెట్ తో చక్కని సహకారం అందించారు. కాసేపట్లో శ్రీలంక బ్యాటింగ్ ప్రారంభించనుంది. ఓవర్ కి 9.80 పరుగుల చొప్పున జత చేయగలిగితే లంక విజయం సాధించే అవకాశం ఉంది.

  • Loading...

More Telugu News