: పడిలేచిన కడలి తరంగంలా సెన్సెక్స్!


దాదాపు మూడు గంటల పాటు ఇన్వెస్టర్లను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తూ, 300 పాయింట్లకు పైగా దిగజారిన సెన్సెక్స్ సూచిక, 12:30 తరువాత అదే తరహాలో ఉవ్వెత్తున ఎగసింది. ఇన్వెస్టర్ల నుంచి కొనుగోలు మద్దతు వెల్లువెత్తడంతో నష్టాలను పూడ్చుకుని స్వల్ప లాభాల్లోకి వెళ్లింది. శుక్రవారం నాటి సెషన్ ముగిసేసరికి బీఎస్ఈ సెన్సెక్స్ సూచిక 34.29 పాయింట్లు పెరిగి 0.15 శాతం లాభంతో 22,986.12 పాయింట్ల వద్దకు, నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచిక నిఫ్టీ 4.60 పాయింట్లు పెరిగి 0.07 శాతం లాభంతో 6,980.95 పాయింట్ల వద్దకు చేరాయి. బీఎస్ఈలో మిడ్ క్యాప్ 0.78 శాతం, స్మాల్ క్యాప్ 1.21 శాతం నష్టపోయాయి. ఎన్ఎస్ఈ-50లో 23 కంపెనీలు లాభాల్లో నడిచాయి. ఐడియా, టాటా మోటార్స్, భారతీ ఎయిర్ టెల్, కెయిర్న్ ఇండియా, మహీంద్రా అండ్ మహీంద్రా తదితర కంపెనీలు లాభపడగా, బీహెచ్ఈఎల్, బీపీసీఎల్, పీఎన్బీ, అదానీ పోర్ట్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీల ఈక్విటీలు నష్టపోయాయి. బీఎస్ఈలో మొత్తం 2,713 కంపెనీల ఈక్విటీలు ట్రేడ్ కాగా, 881 కంపెనీలు లాభాల్లోను, 1,702 కంపెనీల ఈక్విటీలు నష్టాల్లోనూ నడిచాయి. గురువారం నాటి సెషన్ ముగింపు సమయంలో రూ. 86,34,913 కోట్లుగా ఉన్న మార్కెట్ కాప్ నేడు రూ. 86,09,586 కోట్లకు పడిపోయింది. కాగా, మార్కెట్లో నష్ట భయాలు ఇంకా పోలేదని, తదుపరి వారం సూచికలకు అత్యంత కీలకమని నిపుణులు వ్యాఖ్యానించారు.

  • Loading...

More Telugu News