: కేరళ కనుగొన్న న్యూ జనరేషన్ ఫుట్ బాల్ ...నాలుగు గోల్ పోస్టులు, ఆరుగురు ఆటగాళ్లు, రూల్స్ ఇవే!
ఫుట్ బాల్ ఆటంటే మక్కువ పెంచుకున్న కేరళలోని మలప్పురం ప్రాంత ఔత్సాహికులు కొత్త తరం ఫుట్ బాల్ ఆటను కనుగొన్నారు. మైదానంలో నాలుగు గోల్ పోస్టులు, ఒక్కో వైపు ఆరుగురు ఆటగాళ్లు మాత్రమే ఉండటం దీనిలోని ప్రత్యేకత. పోరూరు గ్రామంలో ఈ సాయంత్రం స్థానిక ఫుట్ బాల్ క్లబ్ ల ఆధ్వర్యంలో పోటీ జరగనుండటంతో దేశవ్యాప్తంగా ఫుట్ బాల్ ప్రేమికులు ఈ ఆట ఎలా సాగుతుందన్న విషయమై ఆసక్తిని ప్రదర్శిస్తున్నారు. ఈ ప్రాంతంలోని ఆరు ఫుట్ బాల్ క్లబ్ ల కలయికలో ఏర్పడ్డ 'జనకీయ ఫుట్ బాల్ కమిటీ' ఈ ఆటను తయారు చేసింది. 50 మీటర్ల వెడల్పుతో ఉండే మైదానంలో ప్రతి టీమ్ కు రెండు గోల్ పోస్టులుంటాయి. ఒక్కో జట్టులో ఇద్దరు కీపర్లు, ఆరుగురు ఆటగాళ్లుంటారు. ఇద్దరు రిఫరీలు మ్యాచ్ లను 60 నిమిషాల పాటు నడిపిస్తారు. సాధారణంగా బంతి మైదానం బయటకు వెళితే, 'త్రోన్ ఇన్' బదులు ఆట మైదానం మధ్యలో తిరిగి మొదలవుతుంది. కార్నర్ కిక్ కూడా ఉండదు. ఆఫ్ సైడ్ రూల్ (బంతిని గోల్ పోస్టులోకి కిక్ చేసే ముందు ప్రత్యర్థి జట్టులోని కనీసం ఒక ప్లేయర్ అతనికన్నా గోల్ పోస్టుకు దగ్గరగా ఉండాలి) కూడా ఇందులో ఉండదు. తాము అభివృద్ధి చేసిన ఆటపై అందరూ ఆసక్తి చూపుతున్నారని, తమ ప్రాంతాల్లో ఇటువంటి మ్యాచ్ లు నిర్వహించాలని కోరుతున్నారని రూల్స్ అభివృద్ధిలో భాగం పంచుకున్న ఇషాక్ పోరూర్ తెలిపారు. నేటి రాత్రి 8 గంటలకు 'కొట్టకున్న' మైదానంలో తొలి పోటీ జరుగుతుందని వివరించారు.