: భవిష్యత్తుపై ఆశలు... సిరియాలో ఆగిన కాల్పులు, వారం పాటు చర్చలు!
పెను అంతర్యుద్ధం జరుగుతున్న సిరియాలో ప్రజలకు భవిష్యత్తుపై ఆశలు కల్పించేలా ఓ కీలక మార్పు చోటు చేసుకుంది. దేశంలో శాంతి చర్చలు జరిగేలా వారం పాటు యుద్ధాన్ని నిలిపివేయాలన్న ఒప్పందం కుదిరింది. తిరుగుబాటు దారులకు, సిరియా ప్రభుత్వానికి మధ్య జనీవాలో చర్చలు జరుగుతాయని, ఈ నేపథ్యంలో కాల్పుల విరమణకు అంగీకరించామని యూఎస్ రక్షణ మంత్రి జాన్ కెర్రీ వ్యాఖ్యానించారు. మ్యూనిచ్ లో మీడియాతో మాట్లాడిన ఆయన సిరియాలో ఐఎస్ఐఎస్ కు వ్యతిరేకంగా జరిగే పోరు మాత్రం ఆగదని చెప్పారు. ఈ చర్చలు ముగిసేలోగా ఎటువంటి అవాంఛనీయ ఘటనలూ జరగకుండా ఉండటం ముఖ్యమని, ప్రభుత్వ వ్యతిరేక దళాలు మాట నిలుపుకుంటాయని భావిస్తున్నామని అన్నారు. సిరియాలోని అన్ని వర్గాలకూ ఇది నిజమైన పరీక్ష వంటిదని అన్నారు. అయితే, చర్చలు ఫలవంతం కావాలంటే సిరియా ప్రభుత్వానికి మద్దతుగా రష్యా జరుపుతున్న విమాన దాడులను ఆపివేయాలని బ్రిటన్ విదేశాంగ శాఖ కార్యదర్శి ఫిలిప్ హమ్మోండ్ వ్యాఖ్యానించడం గమనార్హం.