: 'డిజిటల్' అంటే ఏంటి?... తలపట్టుకుంటున్న నాస్కామ్!
ఐటీ పరిశ్రమ శరవేగంగా విస్తరిస్తున్న వేళ 'డిజిటల్' అన్న పదానికి వర్తించే కంపెనీలను ఏ విధంగా విభజించాలి? అసలు డిజిటల్ అంటే అర్థం ఏం వస్తుందన్న విషయమై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ తలపట్టుకుంటోంది. డిజిటల్ అర్థాన్ని ఖరారు చేసేందుకు నాస్కామ్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశాలు నిర్వహిస్తుంది. మొత్తం ఐటీ సెక్టారు ఆదాయంలో డిజిటల్ పేరు చెప్పుకుంటున్న కంపెనీల ఆదాయం 15 శాతాన్ని దాటిన తరుణంలో పలు ఫిర్యాదులు వస్తుండగా, డిజిటల్ పదాన్ని ఎంతవరకూ పరిమితం చేయాలన్న విషయమై కసరత్తు చేస్తోంది. "ప్రతి ఒక్కరూ ఈ పదాన్ని వివిధ రకాలుగా వాడుతున్నారు. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఇదే విషయాన్ని చర్చిస్తోంది. ఓ నిర్ణయానికి రావడానికి కొంత సమయం పట్టవచ్చు" అని నాస్కామ్ ఐటీ సేవల కౌన్సిల్ చైర్ పర్సన్ రాజగోపాలన్ వ్యాఖ్యానించారు. కాగా, గత కొన్ని సంవత్సరాలుగా ఐటీ కంపెనీల డిజిటల్ ఆదాయం గణనీయంగా పెరుగుతూ వచ్చింది. యాక్సెంచర్ సంస్థ తమ డిజిటల్ ఆదాయం 7 బిలియన్ డాలర్లని ప్రకటించింది. క్లౌడ్ సేవల ద్వారా 3.5 బిలియన్ డాలర్ల ఆదాయం సమకూరిందని తెలిపింది. ఇదే సమయంలో భారత ఐటీ కంపెనీలు క్లౌడ్ సేవల ఆదాయాన్ని కూడా ఈ విభాగంలో కలిపేస్తున్నాయి. "మీరు ఆపిల్, నారింజ, పైనాపిల్ వంటి పళ్లన్నింటినీ కలిపేస్తున్నారు. వాస్తవానికి క్లౌడ్ సేవలు మౌలిక వసతుల కిందకు వస్తాయి. కానీ దాన్ని డిజిటల్ విభాగంలో కలిపేస్తున్నారు" అని సుదీర్ఘకాలంగా ఐటీ ఎగ్జిక్యూటివ్ గా పని చేస్తున్న ఓ నిపుణుడు వ్యాఖ్యానించారు. ఇక డిజిటల్ అన్న పదానికి ఓ నిర్వచనం ఉంటే పెట్టుబడిదారులు మరింత సౌలభ్యంతో ముందుకు వస్తారని ఈ రంగంలోని నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. మొబైల్ ఫోన్ల వ్యాపారం కూడా డిజిటల్ గా మారిపోయిందని వ్యాఖ్యానించిన కన్సల్టెన్సీ సంస్థ కేపీఎంజీ భాగస్వామి అఖిలేష్ తనూజా, సిద్ధాంతాల పరంగా ఈ విధానం సరైంది కాదని అన్నారు. శరవేగంగా మారుతున్న కాలానికి అనుగుణంగా వ్యాపారాలనూ విభజించాల్సిన సమయం ఆసన్నమైందని భావిస్తున్న నాస్కామ్, త్వరలోనే ఈ సమస్యను పరిష్కరించే దిశగా ప్రయత్నాలు చేస్తోంది.