: ఆక్సెంచర్ ఉద్యోగి, ఉగ్ర అనుమానితుడు సర్దానాకు బెయిల్ మంజూరు!
హాంకాంగ్, మలేషియా, సౌదీ అరేబియా తదితర దేశాల్లో ప్రముఖ ఐటీ సంస్థ ఆక్సెంచర్ తరఫున పనిచేసి, ఈ నెల 3వ తేదీన ఉగ్రవాద చర్యలకు పాల్పడుతున్నాడన్న అనుమానంతో పోలీసులు అరెస్ట్ చేసిన సమీర్ సర్దానాకు గోవా కోర్టు బెయిలును మంజూరు చేసింది. ఓ రిటైర్డ్ ఆర్మీ ఉద్యోగి కుమారుడైన సమీర్ ను ఉగ్ర అనుమానాలతో ఈ నెల 3న అరెస్ట్ చేయగా, ఈ ఘటన దేశవ్యాప్త సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. వాస్కో రైల్వే స్టేషన్ లో అనుమానాస్పదంగా సంచరిస్తుండటం, బాంబుల తయారీపై సమాచారం సేకరిస్తున్నాడన్న ఆరోపణలపై సమీర్ ను అరెస్ట్ చేశారు. ఆపై అతని ల్యాప్ టాప్ ను పరిశీలించగా, ఎటువంటి ఆధారాలూ లభ్యం కాకపోవడంతో ఉగ్రవాదులతో సంబంధం లేదని భావించిన కోర్టు బెయిల్ మంజూరు చేసింది. సమీర్ తన పాస్ పోర్టును కోర్టుకు అందించాలని, రూ. 10 వేల పూచీకత్తు కట్టాలని కోర్టు నిబంధనలు విధించింది.