: అప్పనంగా ఓ కంపెనీని కొన్న కపిల్ దేవ్... ఐటీ శాఖ నజర్!


ఒకప్పటి భారత క్రికెట్ దిగ్గజం కపిల్ దేవ్ పై ఆదాయపు పన్ను శాఖ దృష్టిని సారించింది. ఓ కంపెనీ ఈక్విటీ విలువ రూ. 438 పై స్టాక్ మార్కెట్లలో ట్రేడ్ అవుతుండగా, వాటిని రూ. 140పై ఆయన కొనుగోలు చేశాడు. రూ. 32 కోట్ల విలువైన ఆ కంపెనీని కేవలం రూ. 6 కోట్లు వెచ్చించి ఆయన కొనుగోలు చేయడంతో, దీని వెనకున్న అసలు విషయాన్ని తేల్చాలని ఐటీ అధికారులు రంగంలోకి దిగారు. తన స్నేహితుడు, నోయిడాలో పలు వివాదాల్లో చిక్కుకున్న యాదవ్ సింగ్ కు చెందిన కంపెనీని కపిల్, ఆయన భార్య రోమీ దేవ్, మరో ఇద్దరు కలసి అతి తక్కువ ధరకు సొంతం చేసుకున్నట్టు ఏబీపీ న్యూస్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. ఇదే సమయంలో రూ. 400కు పైగా ఉన్న షేర్ ను రూ. 140కే కపిల్ సొంతం చేసుకోవడాన్ని గమనించిన ఐటీ అధికారులు, సెబీ నిఘా బృందం విచారిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే, యాదవ్ సింగ్ అనే వ్యక్తి తనకెవరో తెలియదని కపిల్ వ్యాఖ్యానించడం గమనార్హం. 2008 నుంచి 2014 మధ్య యాదవ్ సింగ్ సంస్థ నుంచి కమిషన్ రూపంలో అక్రమంగా రూ. 100 కోట్లను కాజేశాడన్న కేసులో సీబీఐ ఆయన్ను ఈ నెల 3న అరెస్ట్ చేసింది. యాదవ్ సింగ్ నోయిడా, గ్రేటర్ నోయిడా అభివృద్ధి, యమునా ఎక్స్ ప్రెస్ వే తదితర ప్రాజెక్టులకు చీఫ్ ఇంజనీర్ గా వ్యవహరించాడు. మొత్తం రూ. 2,500 కోట్ల విలువైన పనులను పర్యవేక్షించిన ఆయన, ప్రతి రూపాయిలో ఐదు పైసలను తన కమిషన్ గా స్వీకరించేవాడని సీబీఐ గతంలోనే ఆరోపించింది.

  • Loading...

More Telugu News