: ఉగ్రవాదులను హిందువులుగా చూపేందుకు తాయెత్తులు కొన్నారట!


గుజరాత్ లో ఎన్ కౌంటర్ లో మరణించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఇష్రాత్ జహాన్, లష్కరే తోయిబా ఆత్మాహుతి దళ సభ్యురాలని నిన్న బాంబేసిన డేవిడ్ హెడ్లీ, ఈ రోజు విచారణలో భాగంగా ఉగ్రవాదులను హిందువులుగా చూపేందుకు తాము చేసిన పనులను వివరించాడు. ముంబై కోర్టు నుంచి అమెరికాలో ఉన్న హెడ్లీని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నాలుగో రోజు విచారిస్తుండగా, ఉగ్రవాదుల కోసం సిద్ధివినాయక దేవాలయం నుంచి తాయెత్తులు, చేతులకు కట్టుకునే దారాలను కొనుగోలు చేసినట్టు చెప్పాడు. ఇవి చేతులకు ఉంటే, ఉగ్రవాదులన్న అనుమానం రాదన్నది తమ ఉద్దేశమని చెప్పాడు. 26/11 దాడులకు ముందు గేట్ వే ఆఫ్ ఇండియా, కుఫీ పరేడ్ ప్రాంతాలను సందర్శించి, చివరకు తమ దాడికి కుఫీ పరేడ్ అనుకూలమన్న నిర్ణయానికి వచ్చామని చెప్పాడు. 2008 ఏప్రిల్ 9 నుంచి 15 వరకూ ముంబైలోని పలు ప్రాంతాల్లో రెక్కీలు నిర్వహించిన తాను, పాక్ కు వెళ్లి సాజిద్ మీర్, మేజర్ ఇక్బాల్ తదితరులను కలిసి దాడుల నిమిత్తం వెళ్లేవారిని ఎక్కడకు పంపాలన్న విషయాన్ని వీడియో ద్వారా వివరించినట్టు హెడ్లీ సాక్ష్యమిచ్చాడు. ముంబై ఎయిర్ పోర్టులోనూ రెక్కీ నిర్వహించి, అక్కడ దాడి సాధ్యం కాదని తాను చెబితే, మేజర్ ఇక్బాల్ కొంత అసహనాన్ని ప్రదర్శించాడని తెలిపాడు. పాక్ లో ఉన్న సమయంలోనే అమెరికా వెళ్లి న్యూయార్క్, ఫిలడెల్ఫియా ప్రాంతాలను పర్యటించానని, అక్కడి నుంచే తహవూర్ రానాతో మాట్లాడి ముంబై దాడులు, చేరుకోవాల్సిన ప్రదేశాల గురించి మాట్లాడినట్టు వివరించాడు. తాను వినాయకుడి గుడి నుంచి 20 వరకూ బ్యాండ్లు కొన్నానని, వీటిని సాజిద్ మీర్ కు ఇస్తే, మంచి ఆలోచన చేశావని అభినందించాడని గుర్తు చేసుకున్నాడు. అప్పట్లో లఖ్వీ తనతో మాట్లాడుతూ, ఇండియాలో ఏ ప్రాంతంపై దాడి చేసినా, అది తమకు ఆనందమేనని, పాక్ ప్రతీకారంలో భాగమేనని అన్నట్టు హెడ్లీ వివరించాడు. జ్యూయిష్ లు, ఇజ్రాయిలీలు అధికంగా ఉండే చాబాద్ హౌస్ ను మాత్రం లష్కరే తోయిబా ఎంచుకుందని తెలిపాడు.

  • Loading...

More Telugu News