: కేసీఆర్ చూపిన బాటలో నడుస్తున్న చంద్రబాబు?


చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, ఆయన మంత్రివర్గంలో ఓ సభ్యుడు మాత్రమే. మారిన పరిస్థితుల నేపథ్యంలో ఇద్దరూ చెరో రాష్ట్రానికి ముఖ్యమంత్రులయ్యారు. ఇక రాజకీయ ఎత్తులు, ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడంలో చంద్రబాబు కన్నా తానే ముందున్నానని ఇప్పటికే కేసీఆర్ నిరూపించుకున్నారు. ఓటుకు నోటు కేసు, ఎమ్మెల్యేలను ఆకర్షించడం, ఉప ఎన్నికల్లో ఘన విజయాలు, గ్రేటర్ లో ఎవరూ ఊహించని మెజారిటీ... ఇలా చెప్పుకుంటూ పోతే ఈ ఏడాదిన్నరకు పైగా సాగిన పాలనలో కేసీఆర్ విజయాలు ఎన్నో ఉన్నాయి. అయితే, ఇక్కడ చంద్రబాబు నిద్రలేని రాత్రులను గడిపేలా చేస్తున్నది ఏంటంటే, పార్టీ నుంచి వలసలు! గత అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన 15 మందిలో ఇప్పటికే 10 మంది టీఆర్ఎస్ లో చేరిపోగా, నేడో రేపో మరో ఇద్దరు వెళ్లిపోయేట్టు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ అధినేత నడుస్తున్న బాటలోనే, అంటే ప్రత్యర్థి పార్టీల్లోని ఎమ్మెల్యేలను తన వైపు తిప్పుకుని వారిని ఇబ్బందుల్లోకి నెట్టేలా చంద్రబాబు అడుగులు వేస్తున్నారా? ఆ పార్టీ నేతల నుంచి వస్తున్న లీకులు చూస్తుంటే అలాగే అనిపిస్తోంది. కనీసం 25 మంది వైసీపీ ఎమ్మెల్యేలు పార్టీని వీడి తెలుగుదేశంలో చేరనున్నారని వార్తలు వచ్చాయి. నిన్న విజయవాడ పశ్చిమ ఎమ్మెల్యే జలీల్ ఖాన్, స్వయంగా వెళ్లి చంద్రబాబును కలవడం కొత్త చర్చకు తెరలేపింది. ఇక ఎవరి పేర్లయితే 'జంప్ జిలానీ'లుగా ప్రచారం అవుతున్నాయో, వారంతా మీడియా సమావేశాలు పెట్టి తాము పార్టీని వీడటం లేదని ప్రకటనలు ఇస్తున్నారు. ప్రకాశం జిల్లాలో కందుకూరు, అద్దంకి శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్ లు తెలుగుదేశంలో చేరుతారని వార్తలు రాగా, వీరిద్దరూ అటువంటిదేమీ లేదని మీడియాకు చెప్పాల్సి వచ్చింది. గుంటూరు జిల్లాలో పరిస్థితి కూడా ఇలానేఉంది. చంద్రబాబు మైండ్ గేమ్ ఆడుతుండటాన్ని ఖండిస్తున్నట్టు నరసరాపుపేట ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. ప్రజలలో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న తెలుగుదేశం, దాన్ని పక్కదారి పట్టించేందుకే ఇటువంటి ఎత్తులు వేస్తున్నదని ఆరోపించారు. నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట ఎమ్మెల్యే సంజీవయ్య, కృష్ణా జిల్లా నూజివీడు ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు కూడా తాము తెలుగుదేశాన్ని ఆశ్రయించే పరిస్థితే లేదని తెలిపారు. ఇక తెలుగుదేశం అధినేత చంద్రబాబు 'ఆకర్ష' పథకానికి ఎవరైనా పడతారో? లేదో? గానీ, కేసీఆర్ మాత్రం ఈ విషయంలోనూ ఘన విజయం సాధించారు.

  • Loading...

More Telugu News