: హాట్ సీట్ గా ఏపీ కాపు కార్పొరేషన్ ఎండీ పోస్టు!


కాపులకు రిజర్వేషన్ల పేరిట సీనియర్ రాజకీయవేత్త, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం ఆధ్వర్యంలో జరిగిన ‘కాపు ఐక్య గర్జన’, ఆ తర్వాత ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్ష... కాపు కార్పొరేషన్ ఎండీ పోస్టును హాట్ సీట్ గా మార్చేశాయి. దీక్షలకు, కార్పొరేషన్ ఎండీ పోస్టుకు లింకేమిటంటారా?... అయితే ఇది చదవండి. గడచిన ఎన్నికల్లో భాగంగా అన్ని పార్టీలు తమ మేనిఫెస్టోల్లో కాపులను బీసీల్లో చేరుస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని హామీ ఇచ్చాయి. మరో అడుగు ముందుకేసిన టీడీపీ, ఏటా వెయ్యి కోట్లతో కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. ఈ క్రమంలో కాపు సామాజిక వర్గానికి చెందిన మెజారిటీ ఓట్లు ఆ పార్టీకే పడ్డాయి. ఎన్నికల్లో కీలకమైన కాపు ఓటు బ్యాంకుతో విజయం సాధించిన టీడీపీ ఏపీలో అధికారం చేపట్టింది. ఆ తర్వాత ఆ సామాజిక వర్గానికి చెందిన పలువురు పార్టీ నేతలకు కీలక పదవులు అప్పగించింది. ఇక ఇచ్చిన హామీ మేరకు కాపు కార్పొరేషన్ ను ఏర్పాటు చేసిన సీఎం నారా చంద్రబాబునాయుడు దానికి తొలి విడతగా రూ.100 కోట్లను కేటాయిస్తున్నట్లు ప్రకటించారు. ఇందులో రూ.50 కోట్లను విడుదల కూడా చేశారు. ఇక కార్పొరేషన్ చైర్మన్ గా చలమలశెట్టి రామాంజనేయులును నియమించారు. కార్పొరేషన్ లో కీలక పదవి అయిన మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) పోస్టును బీసీ కార్పొరేషన్ ఎండీకి అదనపు బాధ్యతగా అప్పగించారు. ఈ క్రమంలో హామీ మేరకు వెయ్యి కోట్లేవంటూ ముద్రగడ పద్మనాభం ఆందోళనకు దిగారు. తూర్పు గోదావరి జిల్లా తునిలో ఆయన ఆధ్వర్యంలో జరిగిన కాపు గర్జన హింసాత్మకంగా మారింది. ఆ తర్వాత ఆయన చేపట్టిన ఆమరణ నిరాహార దీక్షకు ప్రభుత్వం దిగొచ్చింది. ఇచ్చిన హామీ మేరకు కార్పొరేషన్ బడ్జెట్ ను ప్రస్తుతానికి రూ.500 కోట్లకు పెంచనున్నట్లు ప్రకటించింది. అంతేకాక వచ్చే ఏడాది రూ.1000 కోట్లను కేటాయించనున్నట్లు ప్రకటించింది. ఈ నిధుల వ్యయంలో ఎండీదే కీలక భూమిక. దీంతో ఏడాదికి వెయ్యి కోట్ల నిధులు రానున్న కాపు కార్పొరేషన్ కు ఎండీగా వెళ్లేందుకు అర్హత ఉన్న అధికారులు తమ వంతు యత్నాలు మొదలుపెట్టారు. ఈ క్రమంలో పలువురు అధికారులు తమకు పరిచయమున్న ఏపీ మంత్రులు, టీడీపీ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారట.

  • Loading...

More Telugu News