: కారెక్కేసిన రాజేందర్ రెడ్డి... చంద్రబాబుతో భేటీ తర్వాత క్షణాల్లో గులాబీ గూటికి!
తెలంగాణలో టీడీపీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. తొలుత కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద గౌడ్, తర్వాత టీ టీడీఎల్పీ నేత ఎర్రబెల్లి దయాకర్ రావు, రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ లు పార్టీకి షాకిచ్చి టీఆర్ఎస్ లో చేరిపోయారు. దీనిపై వేగంగా స్పందించిన పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు నిన్న హుటాహుటిన విజయవాడ నుంచి హైదరాబాదు వచ్చారు. నిన్న సాయంత్రం పార్టీ నేతలతో కీలక భేటీ నిర్వహించారు. అధికారం లేకపోయినా, ఎవరూ ఇబ్బంది పడాల్సిన పనిలేదు, అండగా తానున్నానని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా వేదికపై చంద్రబాబు పక్కన కూర్చున్న మహబూబ్ నగర్ జిల్లా నారాయణ్ పేట్ ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి పార్టీ అధినేతతో కులాసాగా మాట్లాడారు. భేటీలో రాజేందర్ రెడ్డి ప్రసంగించారు కూడా. ఇక చివరగా చంద్రబాబు ప్రసంగిస్తున్న సమయంలో రాజేందర్ రెడ్డి సమావేశం నుంచి బయటకు వచ్చేశారు. నేరుగా హోటల్ తాజ్ కృష్ణకు వెళ్లారు. అప్పటికే అక్కడ ఆయన కోసం వేచి చూస్తున్న తెలంగాణ మంత్రులు హరీశ్ రావు, కేటీఆర్, లక్ష్మారెడ్డిలతో భేటీ అయ్యారు. అక్కడికక్కడే టీఆర్ఎస్ లో చేరుతున్నట్లు ఆయన ప్రకటించారు. చంద్రబాబుతో భేటీ తర్వాత క్షణాల్లోనే ఆయన గులాబీ గూటికి చేరుకోవడం రాజకీయంగా పెను సంచలనం రేపింది. రాజేందర్ రెడ్డి చేరికతో టీఆర్ఎస్ లో చేరిన టీడీపీ ఎమ్మెల్యేల సంఖ్య పదికి చేరింది.