: కార్యకర్తలు ఉన్నంత వరకు పార్టీ ఉంటుంది...సంక్షోభాలు వస్తుంటాయి... పోతుంటాయి!: చంద్రబాబు
తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. హైదరాబాదులో తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశమైన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలే బలమని అన్నారు. కార్యకర్తలు ఉన్నంత వరకు పార్టీ ఉంటుందని ఆయన చెప్పారు. సంక్షోభాలు వస్తుంటాయని, వాటికి ఎదురీదడమే నాయకుడి లక్షణమని ఆయన చెప్పారు. గతంలో తమపై చాలా దాడులు జరిగాయని, వాటికి ఎదురొడ్డి నిలబడ్డామని ఆయన చెప్పారు. ఎన్నో సమస్యలపై పోరాడి నిలదొక్కుకున్నామని ఆయన చెప్పారు. సంక్షోభంలోంచి అవకాశం వెతుక్కోవడం తమ నైజమని ఆయన తెలిపారు. కొన్ని విషయాల్లో స్పష్టంగా ఉండాలని ఆయన చెప్పారు. నేతల్లా కార్యకర్తలు పార్టీలు మారరని, వారికోసం పని చేస్తామని ఆయన చెప్పారు. కార్యకర్తలే టీడీపీకి బలమని చెప్పిన ఆయన, వారి కోసం నిత్యం కష్టపడతామని అన్నారు. మరోసారి పార్టీ ముఖ్యనేతలతో సమావేశమవుతానని ఆయన చెప్పారు.