: ఒక్క లాగిన్ ఐడీ ఇస్తే, లక్షలకు లక్షలు: యాపిల్ ఉద్యోగులకు ఆఫర్!
ఐటీ, సాఫ్ట్ వేర్ దిగ్గజం యాపిల్ ను దెబ్బతీయాలన్న లక్ష్యంతో హ్యాకర్లు కోట్లాది రూపాయలను కుమ్మరించడానికి వెనుకాడటం లేదు. యాపిల్ ఉద్యోగులకు వల విసురుతూ, ఒక్క లాగిన్ ఐడీ, పాస్ వర్డ్ ఇస్తే, లక్షల రూపాయలు ఇస్తామని ఆఫర్ ఇస్తున్నారు. ముఖ్యంగా జూనియర్ లెవల్ లోని ఉద్యోగులకు, అప్పుడే చేరిన వారికి ఈ తరహా ఆఫర్లు వస్తున్నట్టు తెలుస్తోంది. ఉద్యోగులను కాంటాక్ట్ చేసే హాకర్లు వారిని లోబరచుకునేందుకు యత్నిస్తున్నారని సమాచారం. "యాపిల్ సంస్థలో ఎంతమంది ఉద్యోగులకు ఈ తరహా ఆఫర్లు వస్తున్నాయో తెలిస్తే ఆశ్చర్యపోతారు. నా లాగిన్ వివరాలు చెబితే 20 వేల యూరోలు (సుమారు రూ. 15 లక్షలు) ఇస్తామన్నారు. నేను కావాలంటే ఇప్పుడే నా ఐడీ, పాస్ వర్డ్ అమ్మేసుకోవచ్చు" అని ఓ ఉద్యోగి వ్యాఖ్యానించారు. ఈ విషయం యాపిల్ కు తెలుసునని, ఉద్యోగులను ఈ తరహా చర్యలకు దూరం చేసేందుకు 'గ్రో యువర్ ఓన్' పేరిట ప్రత్యేక కార్యక్రమాన్ని యాజమాన్యం ప్రారంభించిందని తెలిపాడు.