: నారాయణఖేడ్ లో స్నానం చేసిన నీళ్లనే తిరిగి వాడుకోవాల్సిన దుస్థితి ఉంది!: హరీష్ రావు
మెదక్ జిల్లా నారాయణఖేడ్ లో స్నానం చేసిన నీళ్లనే తిరిగి వాడుకోవాల్సిన దుస్థితి నెలకొని ఉందని.. ఈ దుస్థితికి కారణం గత కాంగ్రెస్ పాలకులేనని తెలంగాణ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. నారాయణఖేడ్ లో ఉప ఎన్నికల ప్రచారం నిమిత్తం నిర్వహించిన టీఆర్ఎస్ సభలో ఆయన పాల్గొన్నారు. నారాయణఖేడ్ వెనుకబడిపోవడానికి కారణం గతంలో పాలించిన టీడీపీ, కాంగ్రెస్ నాయకులేనన్నారు. అందుకే, నారాయణఖేడ్ ను దత్తత తీసుకున్నానని సిద్ధిపేటలో జరిగిన అభివృద్ధి ఇక్కడా చేసి చూపిస్తానని అన్నారు. గతంలో జరిగిన వరంగల్ ఉపఎన్నికలో, ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ తిరుగులేని విజయం సాధించిందని.. అదేవిధంగా నారాయణఖేడ్ లో కూడా తాము గెలుస్తామని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.