: బాగు పడాలంటే టీఆర్ఎస్ కు ఓటేయండి: కేసీఆర్
అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న నారాయణఖేడ్ ను త్వరలోనే మరో సిద్ధిపేటలా తయారు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యాఖ్యానించారు. భవిష్యత్ అభివద్ధిని దృష్టిలో ఉంచుకుని ప్రజలు టీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. ఖేడ్ సమీపంలో జరిగిన బహిరంగ సభలో ప్రసంగిస్తూ, ఇక్కడ 30 వేల మందికి నెలకు రూ. 1000 చొప్పున పింఛన్ అందిస్తున్నామని గుర్తు చేశారు. టీఆర్ఎస్ ను గెలిపిస్తే, నారాయణఖేడ్ లో 150 పడలకతో అత్యాధునిక ఆసుపత్రిని నిర్మిస్తామని హామీ ఇచ్చారు. హాస్టళ్లలో ఉండి చదువుతున్న చిన్నారులకు సన్నబియ్యంతో అన్నం పెడుతున్నామని తెలిపిన ఆయన, వరంగల్ పార్లమెంట్ ఎన్నికలు, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ప్రజలిచ్చిన తీర్పులాగానే, ఖేడ్ ఉపఎన్నిక తీర్పు కూడా ఉండాలన్నది తన కోరికని అన్నారు. గెలిపిస్తే అభివృద్ధిని ఇక్కడి ప్రజలకు రుచి చూపిస్తానని, వందలాది మంది పేదలకు డబుల్ బెడ్ రూం ఇళ్లు మంజూరు చేయిస్తానని తెలిపారు.