: అమెరికా డాలర్ తోనే సమస్యంతా: ఫోర్బ్స్
వివిధ దేశాల్లో ఆర్థిక వృద్ధి మందగించడానికి, ప్రపంచ మార్కెట్లు నత్తనడకన సాగుతుండటానికి కారణం అమెరికా డాలరేనని ప్రముఖ బిజినెస్ మేగజైన్ ఫోర్బ్స్ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. 2015లో అమెరికా కేవలం 0.7 శాతం వార్షిక వృద్ధికి పరిమితమైందని గుర్తు చేసిన పత్రిక, ఎగుమతులు పడిపోయాయని తెలిపింది. చైనాతో పాటు యూరప్ తదితర దేశాల నుంచి వస్తు ఉత్పత్తులకు అనుకున్నంత డిమాండ్ లేదని, దీని కారణంగా డాలర్ తీవ్ర అనిశ్చితికి గురవుతూ సమస్యలు పెరిగేందుకు కారణమవుతోందని పేర్కొంది. "మరింత లోతుగా చూస్తే, డాలర్ బలపడుతూ ఉండటమే సమస్యలకు మూల కారణంగా అనిపిస్తోంది. 2008 నాటి మాంద్యం నుంచి అమెరికా విజయవంతంగా బయటపడటానికి కారణమైన కరెన్సీయే ఇప్పుడు సమస్యలు సృష్టిస్తోంది" అని వెల్లడించింది. 2014 జూలై తరువాత అమెరికాలో మాన్యుఫాక్చరింగ్ రంగంలో అతి తక్కువ వృద్ధి రేటు నమోదైందని డ్యూటస్చ్ బ్యాంక్ చీఫ్ ఎకానమిస్ట్ టోర్ స్టెన్ స్లాక్ వ్యాఖ్యానించారు. ఇదే సమయంలో యూరప్, జపాన్ ఉత్పత్తి రంగాలు దూసుకెళ్తున్నాయని గుర్తు చేశారు. అమెరికన్ డాలర్ బలపడటం మొదలు కాగానే ఉత్పత్తి రంగం వృద్ధి ఆగిపోయిందని అన్నారు. అందుకు చైనా నుంచి డిమాండ్ తగ్గడం కూడా సహకరించిందని గుర్తు చేశారు. డాలర్ విలువ తగ్గితే, వస్తు ఉత్పత్తులకు డిమాండ్ పెరిగి పరిస్థితి సద్దుకుంటుందన్న అభిప్రాయాన్ని ఫోర్బ్స్ వ్యక్తం చేయడం గమనార్హం.