: సాంకేతిక సమస్యతో నేడు హెడ్లీ విచారణ వాయిదా
ముంబయి 26/11 దాడుల కేసులో నిందితుడు డేవిడ్ హెడ్లీ విచారణ నేడు వాయిదా పడింది. ప్రస్తుతం అమెరికా జైల్లో ఉన్న అతడిని ముంబయి కోర్టు రెండు రోజుల నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తున్న విషయం తెలిసిందే. అయితే మూడోరోజైన నేడు వీడియో లింక్ లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో రేపటికి విచారణను వాయిదా వేశారు. అమెరికాలో హెడ్లీ ఉన్న జైలు నుంచే సాంకేతిక సమస్య తలెత్తిందని, దాంతో కేవలం ఆడియో లింక్ మాత్రమే వస్తోందని, వీడియో లింక్ రావడం లేదని ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉజ్వల్ నికమ్ తెలిపారు. పలుమార్లు ప్రయత్నించినప్పటికీ వీలుకాలేదన్నారు. దాంతో రేపు విచారణకు అనుమతిస్తామని యూఎస్ అధికారులు చెప్పారని పేర్కొన్నారు. ఈ క్రమంలో హెడ్లీని విచారించేందుకు మరింత ఎక్కువ సమయం ఇస్తామని అమెరికా అధికారులు తెలిపినట్టు నికమ్ చెప్పారు.