: అందర్నీ కంటతడి పెట్టిస్తున్న పన్నెండేళ్ల బాలుడి అక్షర ఆ(ని)వేదన!


సిరియాలో నెలకొన్న ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం కారణంగా జరుగుతున్న నష్టం, దానితో తమ కుటుంబం ఎంతగా ఇబ్బందులు పడిందో, తామెలా దేశం దాటి స్వీడన్ చేరుకున్నామో వివరిస్తూ, 12 ఏళ్ల వలస బాలుడు అహ్మద్.. కింగ్ గుస్తావ్ కు రాసిన లేఖ ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లోకి ఎక్కి హృదయమున్న ప్రతి ఒక్కరినీ కదిలించి వేస్తోంది. గతంలో సిరియాలో లగ్జరీ లైఫ్ అనుభవించిన అహ్మద్, ఇప్పుడు ఎలా ఉన్నాడో స్వయంగా అతని లేఖలోని మాటల్లోనే... "ప్రియమైన రాజు గుస్తావ్! నా పేరు అహ్మద్. నాకు పన్నెండు సంవత్సరాలు. నాకు నాన్న, అమ్మ, సోదరుడు ఉన్నారు. సిరియాలోని అలెప్పోలో ఒ అందమైన ఇంట్లో ఉండేవాళ్లం. మా నాన్నకు చిన్న పిల్లలకు దుస్తులను తయారు చేసే పెద్ద ఫ్యాక్టరీ ఉండేది. ఆయన మా కోసం ఎన్నో బహుమతులు, బొమ్మలు కొనుక్కొచ్చేవారు. మాకు కార్లు కూడా ఉన్నాయి. సిరియాలో యుద్ధం మొదలై మిసైళ్ల చప్పుళ్లు వినిపించేంత వరకూ మేము ఆనందంగానే ఉన్నాం. ఆపై... నాన్న ఫ్యాక్టరీని తగలబెట్టేశారు. ఆ తరువాత బాధంటే ఏంటో నాకు పరిచయమైంది. ఆపై నేనింక స్కూలుకు కూడా పోలేదు. నా టీచరును నా కళ్ల ముందే కాల్చి చంపారు. ఆ క్షణాలను నేను మరచిపోలేను. నా జీవితంలో మొట్టమొదటి ఘోర దుర్ఘటన అది. మా నాన్న ఇంట్లోకి వచ్చి ఫ్యాక్టరీ కాలిపోయిందని అమ్మకు చెప్పడం, ఆపై అమ్మ బిగ్గరగా ఏడవడం నేను విన్నాను. ఆ తరువాత మమ్మల్ని ఓ సురక్షిత ప్రాంతానికి చేర్చాలని ఆయన ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఓ శనివారం ఉదయాన్నే టర్కీకి బయలుదేరాం. అది ఓ భయంకర ప్రయాణం. పెద్ద పెద్ద అలల మధ్య చీకటిలో చిన్న బోటులో మా ప్రయాణం సాగింది. నా కెంతో భయం వేసింది. బోటులోని వారందరిదీ అదే పరిస్థితి. పిల్లలైతే ఏడుస్తున్నారు. అంత బాధలోనూ మా నాన్న నవ్వుతూ, మమ్మల్ని శాతంగా ఉంచేందుకు ప్రయత్నించారు. మాకేం జరుగుతోంది? మా ఇల్లు ఎక్కడ? నా మంచం, నా బొమ్మలు ఎక్కడ?... ఇవి నా మదిలో ఉదయించిన ప్రశ్నలు. మేము ఓ ద్వీపానికి వచ్చాం. అక్కడ మా పరిస్థితి బోటులో కన్నా దారుణం. పోలీసులు తీసుకెళ్లి చాలా మంది ప్రజలున్న చోట మమ్మల్ని ఉంచారు. అక్కడెంతో తొక్కిసలాట. తిండి కూడా లేదు. పోలీసులు విడుదల చేసే వరకూ అక్కడే ఉన్నాం. దాదాపు 15 రోజులు. నేను తీవ్రమైన ఒత్తిడిలో కూరుకుపోయాను. ఏడుస్తున్న అమ్మను నాన్న ఓదార్చలేకపోయేవాడు. గతంలో నన్ను చూసుకున్నట్టుగా మా నాన్న మమల్ని చూసుకోలేకపోయాడు. నాకూ ఏడుపు వచ్చేది. ఎప్పుడు ఏడ్చినా, అమ్మా నాన్నా చూడకుండా ఏడ్చేవాడిని. ఎందుకంటే నా ఏడుపు వారిని మరింత బాధకు గురి చేస్తుంది కాబట్టి. నాలాగే మా అమ్మ ఏడుస్తుంటే చూసి నా హృదయం ముక్కలైంది. ఆ తరువాత మేము స్వీడన్ కు వచ్చాం. నా కోరిక ఏంటంటే స్వీడన్ రాజును కలుసుకుని నా కథ చెప్పాలి. ఆయన చాలా మంచి వారని విన్నాను. ఆయన్ను కలిసేటప్పుడు కొత్త బట్టలు వేసుకోవాలని వాటిని చానాళ్లుగా నాతోనే దాచుకున్నాను. ఒకప్పుడు అందమైన పెద్ద భవంతిలో ఉన్న మేము, ఇప్పుడు మా ఆంటీతో కలిసి చిన్న గదిలో ఉంటున్నాం. నేను నిద్ర లేచే ప్రతి ఉదయం మా నాన్నను కిటికీలో నుంచి చూడాలని అనిపిస్తుంటుంది. కానీ అన్ని గదులుండే ఇల్లును కొనేందుకు నాన్న దగ్గర డబ్బుల్లేవు. మాకేం మిగిలింది? మిమ్మల్ని నేను కలవాలని అనుకుంటున్నాను రాజా! నా కొత్త బట్టలు వేసుకుని మీ దగ్గరకు రావాలన్నది నా కోరిక. వాటిని నేను సిరియా నుంచి తెచ్చుకున్నాను. తమ విధేయుడు అహ్మద్, 12 మాల్నో" ఇప్పుడీ లేఖ సోషల్ మీడియా వైరల్. చదివిన వాళ్లు కంటతడి పెడుతున్నారు. రాజు ఆ బాలుడికి అపాయింట్ మెంట్ ఇవ్వాలని కోరుకుంటున్నారు. అహ్మద్ కోరికను తీర్చేందుకు గుస్తావ్ అంగీకరిస్తారనే మనమూ ఆశిద్దాం.

  • Loading...

More Telugu News