: డాక్టర్ల కాల్పుల కేసులో సరికొత్త ట్విస్ట్!... ఫైనాన్షియర్లను ఆ వైద్యులు నిండా ముంచారట


హైదరాబాదులోని హిమయత్ నగర్ లో నిన్న వైద్యుల మధ్య చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో గంటకో ట్విస్ట్ వెలుగు చూస్తోంది. హిమయత్ నగర్ లో లారెల్ హస్పిటల్ ను ఏర్పాటు చేసిన ముగ్గురు వైద్యులు శశికుమార్, సాయికుమార్, ఉదయ్ కుమార్ ల మధ్య నిన్న ఉన్నట్టుండి కాల్పులు చోటుచేసుకున్నాయి. మాట్లాడుకుందాం రమ్మంటూ ముగ్గురూ కూడబలుక్కుని హిమయత్ నగర్ లోని బ్లూఫాక్స్ కేఫ్ కు వెళ్లిన వారు నిమిషాల వ్యవధిలోనే కారెక్కి నిర్జన ప్రదేశానికి వెళ్లారు. ఈ క్రమంలో బ్యాక్ సీటులో కూర్చున్న శశికుమార్ ఉన్నట్టుండి, ముందు సీట్లలో కూర్చున్న ఇద్దరు వ్యాపార భాగస్వాములపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్న సాయికుమార్ పరుగులు పెట్టగా, సీటు బెల్టు పెట్టుకున్న ఉదయ్ కుమార్ కు బుల్లెట్ గాయమైంది. ఇక కాల్పుల అనంతరం కారు దిగి పరుగులు పెట్టిన శశికుమార్ ఫాం హౌస్ లో ఉన్న తన స్నేహితురాలి వద్దకు వెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడు. తాజాగా ఈ కేసులో సరికొత్త అంశం వెలుగుచూసింది. హాస్పిటల్ ను ఏర్పాటు చేసిన వీరు ముగ్గురు... పలువురు ఫైనాన్షియర్ల వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నారట. కాల్పుల ఘటనపై సమాచారం అందుకున్న ఫైనాన్షియర్లు కొద్దిసేపటి క్రితం లారెల్ ఆసుపత్రికి వచ్చారు. లాభసాటి హాస్పిటల్ పేరిట తమ వద్ద పెద్ద మొత్తంలో అప్పులు తీసుకుని వడ్డీ సైతం కట్టలేదని ఓ ఫైనాన్షియర్ వాపోయాడు. పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న ఆ ముగ్గురు వైద్యులు తనను నట్టేట ముంచారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశాడు.

  • Loading...

More Telugu News