: రాజధానికి నిధులివ్వాలని...ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరాను: చంద్రబాబు
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి నిధులివ్వాలని కేంద్రాన్ని కోరామని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తెలిపారు. ఢిల్లీలో ఆయన మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం సహాయం కావాలని, గతంలో పెండింగ్ లో ఉన్న లోటు బడ్జెట్ భర్తీ నిమిత్తం నిధులు విడుదల చేయాలని కేంద్రానికి సూచించినట్టు ఆయన వెల్లడించారు. విశాఖ రైల్వే జోన్ గురించి, విభజన చట్టంలో పేర్కొన్న వివిధ ప్రాజెక్టుల గురించి చర్చించినట్టు ఆయన వివరించారు. ఐదేళ్ల పాటు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకహోదా కల్పించాలని కేంద్రానికి సూచించినట్టు ఆయన తెలిపారు. లేని పక్షంలో ఆంధ్రప్రదేశ్ వెనుకబడే అవకాశం ఉందని ఆయన చెప్పారు. ఈ మేరకు అవసరమైన అందరితోనూ చర్చలు జరిపినట్టు ఆయన తెలిపారు. విభజన సందర్భంగా నెలకొన్న సమస్యలు పరిష్కరించే బాధ్యత కేంద్రానిదేనని స్పష్టం చేశానని ఆయన అన్నారు. దీనికి ప్రధాని నరేంద్ర మోదీ, ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ, రైల్వే మంత్రి సురేష్ ప్రభు సానుకూలంగా స్పందించారని ఆయన తెలిపారు.