: 25 అడుగుల కింద... ఆరు రోజుల పాటు... హనుమంతప్ప ఎలా బతికున్నాడంటే...!
లాన్స్ నాయక్ హనుమంతప్ప. మద్రాస్ రెజిమెంట్ కు చెందిన హనుమంతప్ప ఆరు రోజుల క్రితం సియాచిన్ ప్రాంతంలో మైనస్ 45 డిగ్రీల ఉష్ణోగ్రత మధ్య సరిహద్దు భద్రతా విధులు నిర్వహిస్తూ, మంచు చరియలు విరిగిపడటంతో కూరుకుపోయాడు. ఈ ప్రమాదంలో మొత్తం 10 మంది మరణించారని వెల్లడించిన అధికారులు, సహాయక చర్యలు చేపట్టిన వేళ, హనుమంతప్ప ప్రాణాలతో కనిపించాడు. అసలు ఇన్ని రోజులు హనుమంతప్ప ఎలా బతికున్నాడు? సియాచిన్ ప్రాంతంలో విధులు నిర్వర్తించే వారందరికీ ఇటువంటి పరిస్థితులు ఏర్పడితే ఏం చేయాలన్న దానిపై ముందుగానే శిక్షణ ఉంటుంది. మంచు చరియలు విరిగిపడ్డా, మంచు వర్షం భారీగా కురుస్తున్నా, తల మునగకుండా పైకెత్తి, మంచులో ఈతకొడుతూ ఉండాలన్నది తొలి సూత్రం. కానీ హనుమంతప్ప విషయంలో అలా జరుగలేదు. అతను 25 అడుగుల లోతుకు కూరుకుపోయాడు. ఇక హనుమంతప్ప బతికి ఉండే చాన్స్ ఇచ్చే మరో మార్గం... నోటి చుట్టూ కొంత మేరకు మంచును తొలగించుకుని సహాయం కోసం వేచి చూడవచ్చు. ఇక్కడ అదృష్టవశాత్తూ, సహజ సిద్ధంగా గాలి లోనికి ప్రవేశించే వీలున్న చోట హనుమంతప్ప కూరుకుపోయాడు. అదే అతనికి ప్రాణ వాయువును అందించింది. అతను వేసుకున్న దుస్తులు శరీరాన్ని వెచ్చగా ఉంచేందుకు సహకరించి హైపోథెర్మియా సోకకుండా చూశాయి. ఇక సాధ్యమైనంతగా మూత్ర విసర్జన చేయకపోవడం కూడా శరీరంలో వేడిని నిలిపివుంచుతుంది. ఇది కూడా ఆయన ప్రాణాలను నిలిపింది. మరి ఇదే ప్రమాదంలో మిగిలిన 9 మందీ చనిపోయి హనుమంతప్ప ఒక్కడే బతికున్నాడంటే, అతనికి ఈ భూమిపై ఇంకా నూకలు చెల్లివున్నాయి. మృత్యుంజయుడు కాబట్టే, రక్తాన్ని సైతం గడ్డకట్టించే చలిలో ఆరు రోజులు తిండి లేకున్నా బతికాడు. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈ సైనికుడి ఆరోగ్యం క్రమంగా మెరుగు పడుతోందని వైద్యులు వెల్లడించారు.