: దాడుల కోసం 'తాజ్' నమూనా తయారు చేసి ఉగ్రవాదుల ప్రాక్టీస్: హెడ్లీ
ముంబైపై దాడులకు ప్లాన్ చేసిన లష్కరే తోయిబా, తాజ్ మహల్ హోటల్ నే కీలక లక్ష్యంగా చేసుకుందట. అక్కడే సాధ్యమైనంత ఎక్కువ ప్రాణనష్టం కలిగించాలని భావించిన ఉగ్రసంస్థ, తాజ్ మోడల్ లో ఓ నమూనాను తయారు చేసి మరీ, ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చిందని ముంబై పేలుళ్ల కేసు నిందితుడు, ప్రస్తుతం అప్రూవర్ గా మారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు సహకరిస్తున్న డేవిడ్ హెడ్లీ ప్రత్యేక కోర్టుకు వెల్లడించాడు. పాకిస్థాన్ లోని ముజఫరాబాద్ కేంద్రంగా ఈ ప్లాన్ జరిగిందని తెలిపాడు. తాజ్ మహల్ హోటల్ లోపలికి వెళ్లే గేట్, ప్రాంతం, లోపల ఏ వైపు రూములు, సమావేశ మందిరాలు ఉంటాయి, ఏ వైపు రెస్టారెంట్లు ఉంటాయన్న విషయాలన్నీ చర్చించుకుని ఉగ్రవాదులకు శిక్షణ ఇచ్చినట్టు తెలిపాడు. అంతకుముందు తాజ్ హోటల్ పరిసరాలు, మోడల్ ను నిర్మించేందుకు ఇండియాకు వెళ్లి రమ్మని తనకు ఆదేశాలు అందగా, తాను ఆ పనిని పూర్తి చేసినట్టు తెలిపాడు.