: ఐఎస్ఐఎస్ నుంచి తప్పించుకోలేరు: భారత్ ను హెచ్చరించిన యూఏఈ ప్రిన్స్


ఐఎస్ఐఎస్ ఉగ్రవాదం నుంచి భారత్ తప్పించుకోలేదని యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వ్యాఖ్యానించింది. మరో వారంలో అబూదాబీ ప్రిన్స్ షేక్ మహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్ భారత పర్యటనకు రానున్న నేపథ్యంలో ఓ టెలివిజన్ చానల్ ఆయన్ను ఇంటర్వ్యూ చేయగా, ఈ సంచలన వ్యాఖ్యలు చేశారు. "ఇదో దీర్ఘకాల సమస్య. అన్ని దేశాలూ సంపూర్ణంగా సహకరించుకుంటేనే దీనిని అధిగమించగలం. మాకేమీ కాదని మీరు అనుకుంటే, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్టే. మీపై దాడులు జరుగుతాయి. ఏ దేశమైనా సరే... అది ఇండియా అయినా, యూఏఈ అయినా సమస్య ఒకటే" అన్నారు. గత సంవత్సరం ఆగస్టులో ప్రధాని మోదీ అబూదాబీలో పర్యటించిన తరువాత ఇరు దేశాల మధ్యా ద్వైపాక్షిక బంధం మరింత బలపడిన సంగతి తెలిసిందే. పాకిస్థాన్ తో దగ్గరి సంబంధాలు నడుపుతున్న యూఏఈ, గత సంవత్సర కాలంగా కొంత మారినట్టు కనిపిస్తోంది. గడచిన ఏడాది వ్యవధిలో డజను మందికి పైగా ఐఎస్ఐఎస్ తో సంబంధాలున్న భారతీయులను వెనక్కు పంపించింది. ఉగ్రవాదుల్లో మంచివారు, చెడ్డవారు ఉండరని, ఏ రూపంలో ఉన్నా దాన్ని ఉక్కుపాదంతో అణచాల్సిందేనని అల్ నహ్యాన్ వెల్లడించారు.

  • Loading...

More Telugu News