: వరంగల్ జిల్లాలో కొత్తరకం విడాకుల తంతు... అందరూ రావాలంటూ పోస్టర్ల 'ఆహ్వానం'!
'ఆహ్వానం' చిత్రంలో హీరో శ్రీకాంత్, హీరోయిన్ రమ్యకృష్ణ విడిపోతున్నప్పుడు అందరికీ విడాకుల పత్రిక ఇచ్చిమరీ ఆహ్వానిస్తారు. సరిగ్గా అలాగే వరంగల్ జిల్లాలో ఓ ఘటన చోటుచేసుకుంది. తన భార్య నుంచి విడిపోవాలనుకుంటున్న ఓ వ్యక్తి వాల్ పోస్టర్లు ముద్రించి మరీ జిల్లాలోని ధర్మసాగర్ మండలం నారాయణగిరిలో అందరికీ పంచడం కలకలం రేపుతోంది. వరంగల్ జిల్లా నారాయణగిరికి చెందిన ముత్తోజు వెంకట్రాజం, రాజమణి దంపతుల కుమార్తె ఉమకు నాలుగు సంవత్సరాల కిందట దుగ్గొండికి చెందిన కలకొండ సురేష్ తో పెళ్లి చేశారు. వారికి ఓ పాప కూడా ఉంది. అదనపు కట్నం కోసం ఉమను కొంతకాలంగా అత్తింటివారు ఇబ్బంది పెడుతున్నారు. పలుమార్లు వారి గొడవ పంచాయతీకి వెళ్లినా పరిష్కారం కాలేదు. మూడు రోజుల కిందట భార్యతో గొడవపడిన సురేష్ అమెను పుట్టింటికి పంపేశాడు. అనంతరం విడిపోవాలని నిర్ణయించుకున్న అతను విడాకుల పంచాయతీ నిర్వహిస్తున్నామంటూ వాల్ పోస్టర్లు ప్రింట్ చేయించాడు. ఈ నెల 14న నారాయణగిరి గ్రామంలోని వీధుల్లో పంచాయతీ జరుగుతుందని, ప్రతి ఒక్కరూ రావాలని నలుగురితో కలసి ఇంటింటికీ తిరిగి పోస్టర్లు పంచాడు. దాంతో గ్రామంలో కలకలం రేగింది. ఇది తెలిసిన భార్య ఉమ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మరోవైపు సురేష్ పరారీలో ఉన్నాడు.