: ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతం రంగారెడ్డి జిల్లా తాండూరు!


ఇండియాలో కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరం ఏదంటే టక్కున చెప్పే సమాధానం న్యూఢిల్లీ అని. ఢిల్లీలో కాలుష్యం ఓ ఘనపు మీటర్ లో 359 మిల్లీ గ్రాములు కాగా, రంగారెడ్డి జిల్లాలోని తాండూరులో రికార్డయిన కాలుష్య పరిమాణం ఎంతో తెలుసా? సరాసరిన 622 మిల్లీ గ్రాములు. దీంతో ప్రపంచంలోనే అత్యంత కాలుష్య ప్రాంతాల్లో ఒకటిగా తాండూరు చేరిపోయింది. లెక్కలేనన్ని సిమెంటు ఫ్యాక్టరీలు, నాపరాయి, సుద్ద తదితరాలను పాలిష్ చేసే మిషన్ల సంఖ్య వందల్లో ఉండటం ఇక్కడి కాలుష్యాన్ని గణనీయంగా పెంచింది. అన్ని ఫ్యాక్టరీలూ పనిచేస్తుంటే ఈ ప్రాంతంలో ఘనపు మీటరుకు 1958 మిల్లీ గ్రాముల ధూళి కణాలు, కాలుష్యం ఇక్కడి గాలిలో ఉంటుందని కాలుష్య నియంత్రణా మండలి రిపోర్టు కూడా ఇచ్చింది. కాగా, ఇక్కడ ప్రభుత్వ సిమెంటు ఫ్యాక్టరీతో పాటు ఇండియా సిమెంట్స్, పెన్నా సిమెంట్స్, సరిహద్దుల్లోని కర్ణాటక ప్రాంతంలో చెట్టినాడు, విరాట్ సాగర్ ఫ్యాక్టరీలున్నాయి. నిత్యమూ కనీసం 5 వేల లారీలు వచ్చి పోతుంటాయి. దీంతో కాలుష్యం పెరిగి ప్రజలు పలు వ్యాధుల బారిన పడుతున్నారు. ఇక పాలిష్ యూనిట్ల నుంచి వెలువడే సుద్దను ఎప్పటికప్పుడు రోడ్ల పక్కన వేస్తుండటంతో వాహనాల్లో, ముఖ్యంగా ద్విచక్ర వాహనాల్లో తిరగాలంటేనే ప్రజలు భయపడే పరిస్థితి. ఈ కాలుష్యాన్ని తగ్గించేందుకు తక్షణం చర్యలు చేపట్టాలన్నది ప్రజల డిమాండ్.

  • Loading...

More Telugu News