: అంతా ప్రతికూలమే... రూపాయి పతనం, రూ. 28,500కు బంగారం, భారీ నష్టంలో స్టాక్ మార్కెట్!


భారత ఆర్థిక వ్యవస్థకు గడ్డు రోజులు నడుస్తున్నాయి. స్టాక్ మార్కెట్లలో పతనం ఇన్వెస్టర్ల సంపదను కుదేలు చేస్తుంటే, అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిణామాలతో బంగారం ధర శరవేగంగా పెరుగుతోంది. మరోవైపు డాలర్ తో రూపాయి మారకపు విలువ సైతం అదే దారిలో దూసుకుతోంది. ఈ ఉదయం ఫారెక్స్ మార్కెట్లో రూపాయి విలువ క్రితం ముగింపుతో పోలిస్తే 20 పైసలకు పైగా పెరిగి రూ. 68.17కు చేరింది. మరోవైపు బులియన్ మార్కెట్లో పది గ్రాముల స్వచ్ఛమైన బంగారం ధర రూ. 28,460 వద్దకు (ఏప్రిల్ 5 డెలివరీ) చేరింది. అంతకుముందు రూ. 28,500ను కూడా తాకింది. ఇదిలావుండగా, నేటి ఉదయం భారత స్టాక్ మార్కెట్ సైతం భారీగా నష్టపోయింది. సెషన్ ఆరంభంలోనే క్రితం ముగింపుతో పోలిస్తే దిగజారిన సెన్సెక్స్ ఉదయం 10:40 ప్రాంతంలో 284 పాయింట్లు దిగజారి 1.17 శాతం నష్టంతో 24,002 వద్ద, నిఫ్టీ 85.80 పాయింట్ల పతనంతో 1.16 శాతం నష్టపోయి 7,301 పాయింట్ల వద్దా కొనసాగుతున్నాయి. నిఫ్టీ సూచిక 7,280 పాయింట్ల వద్ద మద్దతు పొందలేకపోతే, పతనం మరింత భారీగా ఉండవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. గెయిల్, హిందుస్థాన్ యూనీలీవర్, ఎన్టీపీసీ తదితర సంస్థలు 1 నుంచి 2 శాతం లాభపడగా, టెక్ మహీంద్రా, ఇన్ఫోసిస్, టీసీఎస్, కోల్ ఇండియా తదితర సంస్థలు 3 నుంచి 5 శాతం మేరకు నష్టపోయాయి. సోమవారం నాటి ముగింపుతో పోలిస్తే, ఇన్వెస్టర్ల సంపద లక్ష కోట్ల రూపాయలకు పైగా ఆవిరైంది. ప్రస్తుతానికి భారత మార్కెట్ ను నిలిపి ముందుకు నడిపించే ఉత్ప్రేరకాలేవీ కనిపించడం లేదని, అన్ని వైపుల నుంచి ప్రతికూలాంశాలే కనిపిస్తున్నాయని నిపుణులు వ్యాఖ్యానించారు. బడ్జెట్ ప్రతిపాదనల తరువాతే మార్కెట్ కు దిశానిర్దేశం జరుగుతుందని, అప్పటి వరకూ ఒడిదుడుకులు ఖాయమని అంచనా వేస్తున్నారు.

  • Loading...

More Telugu News